
ఏపికి కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ప్రత్యేక ప్యాకేజిగా ఇచ్చేయబోతోందని ‘బాకా మీడియా’ మొన్న తెగ ప్రచారం చేసేసింది. కానీ కేంద్రం మాత్రం యధాప్రకారం ఏదో కంటి తుడుపు చర్యగా అమరావతి నిర్మాణానికి అదనంగా ఓ వెయ్యి కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 100 శాతం నిధులు ఇస్తామని ప్రకటించి చేతులు దులుపుకొంది. దానితో మళ్ళీ ఏపిలో అకస్మాత్తుగా పొలిటికల్ టెంపరేచర్స్ పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో ఇవ్వాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడలో ప్రత్యేక హోదా కోసం బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయకముందే ఆయన ఈ సభకి ముహూర్తం పెట్టుకొన్నారు కనుకనే నేడు దానిని నిర్వహిస్తున్నారని అనుకోవడానికి లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో ఆయన సంతృప్తి చెందినట్లయితే, మీడియాని పిలిచి ఆ ముక్క చెప్పేసి మళ్ళీ సినిమా షూటింగులకి వెళ్లిపోయేవాడే. కానీ వెళ్ళకుండా సభ నిర్వహిస్తున్నారంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటానికి సిద్ధపడినట్లే భావించవలసి ఉంటుంది. కానీ విశేషం ఏమిటంటే, ఏపిలో ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నప్పటికీ ఒక్క వామపక్షాలు తప్ప కాంగ్రెస్, వైకాపాలు ఆయనకి ఇంతవరకు సంఘీభావం ప్రకటించలేదు.
తమ చేతిలో ఉన్న ప్రత్యేక హోదా అనే బలమైన రాజకీయ ఆయుధాన్ని ఆయన ఎత్తుకుపోవడానికే వస్తున్నారేమో అనే అనుమానాలు, భయాలు వాటికి ఉండటం వలనే అవి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపడానికి ఇష్టపడటం లేదని భావించవచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగానే ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభిస్తే, వాటికే కాదు ప్రత్యేక హోదా పోరాటాలపై పేటెంట్ హక్కులున్నట్లు భావిస్తున్న వైకాపా కూడా చాలా దెబ్బయిపోతుంది. ఎందుకంటే, సిబిఐ కేసుల భయంతో ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చంద్రబాబు నాయుడినే నిందిస్తూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ధైర్యంగా ప్రధాని నరేంద్ర మోడీని నిలదీయలేకపోతున్నారు. అది రాజకీయం చేయడమేనని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.
కానీ పవన్ కళ్యాణ్ కి అటువంటి భయాలు, ఇబ్బందులు, మొహమాటాలు ఏవీ లేవు కనుక ఆయన ధైర్యంగా మోడీని, చంద్రబాబు నాయుడుని నిలదీయగలరు. తిరుపతి సభలోనే ఆ విషయం స్పష్టం అయ్యింది. కనుక ఆయన రీ ఎంట్రీ ఇచ్చి వారిద్దరిపై నేరుగా పోరాటం మొదలుపెడితే జగన్, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న భూటకపు ప్రత్యేక హోదా ఉద్యమాలని ప్రజలు పట్టించుకోవడం మానేస్తారు. అది రాజకీయంగా ఆ రెండు పార్టీలకి మరింత నష్టం కలిగించవచ్చు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం నిరంతరంగా ఉద్యమాలు కొనసాగిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వాటి వలన తెదేపా, భాజపాలకి కూడా చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కనుక పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు అన్నిటికీ శత్రువుగా మారిపోతారు. అప్పుడు వారందరూ ఆయనపై మూకుమ్మడి దాడి చేస్తే తట్టుకొని ఎదురునిలువగలడా లేదా అనేది కాలమే చెపుతుంది. కానీ వాటన్నిటికీ ఎదురు నిలువగలిగితే మాత్రం ఇక ఆయనకి రాజకీయాలలో కూడా తిరుగు ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు.