
రెండు నెలలుగా కాశ్మీర్ లో కొనసాగుతున్న అల్లర్లని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేసింది. చివరికి కాశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలకి కూడా సిద్ధపడింది కానీ వారే అందుకు ఇష్టపడలేదు. కాశ్మీర్ వెళ్ళిన అఖిలపక్ష నాయకులు వారి గుమ్మం ముందు నిలబడి పిలిచినా వారు చర్చలకి రావడానికి ఇష్టపడలేదు. కిటికీలో నుంచే బయటకి పొమ్మని చెప్పేసి తలుపులు మూసుకొన్నారు. అంతకంటే అవమానం మరొకటి ఉండదేమో!
దానితో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, “వేర్పాటువాదులతో మాట్లాడే ప్రసక్తే లేదు,” అని ప్రకటించారు. ఈ పని మొదటే చేసి ఉండి ఉంటే కనీసం ప్రభుత్వానికి, ప్రతిపక్ష నేతలకి గౌరవం మిగిలి ఉండేది. కానీ దేశంలో కొన్ని ప్రతిపక్షాలు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒత్తిడి కారణంగా వేర్పాటువాదులతో చర్చలకి సిద్ధపడి ప్రభుత్వం ఈ అవమానకర పరిస్థితులని ఎదుర్కొంది.
ఢిల్లీలో జె.ఎన్.యు. విద్యార్ధి కన్నయ్య కుమార్ ప్రభుత్వానికి, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడనే ఆరోపణతో కేంద్ర ప్రభుత్వం అతనిని జైలుకి పంపడానికి విఫలయత్నాలు చేసింది. కానీ దేశం నుంచి కాశ్మీర్ ని విడదీయాలని కుట్రలు పన్నుతూ ఆ ప్రయత్నంలోనే కాశ్మీర్ లో గత రెండు నెలలుగా మారణహోమం సృష్టిస్తున్న వేర్పాటువాదులతో కూర్చొని మాట్లాడాలనుకోవడం చాలా విస్మయం కలిగిస్తుంది. తుపాకులు పట్టుకొని ‘ఇండియా గో బ్యాక్’, ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ పాకిస్తాన్, ఐసిస్ ఉగ్రవాద సంస్థ జెండాలు పట్టుకొని తిరుగుతూ, నిత్యం భారత్ వ్యతిరేక సభలు సమావేశాలు నిర్వహిస్తున్న వేర్పాటువాదులకి నచ్చజెప్పి కాశ్మీర్ లో శాంతి నెలకొల్పాలనుకోవడమే అత్యాశ లేదా అవివేకంగా కనిపిస్తోంది.
కాశ్మీర్ వేర్పాటువాదులే కాదు...ఆ రాష్ట్రంలో రాజకీయ నాయకులు కూడా వేర్పాటువాదులకి ఏమాత్రం తీసిపోరు. అందుకే వారు వేర్పాటువాదులని వెనకేసుకొని వస్తుంటారు. వేర్పాటువాదులకి ప్రతినిధులుగా చెప్పుకోదగ్గ అటువంటి రాజకీయ నేతల మాటలని నమ్మి లేదా వారి ఒత్తిళ్ళకి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి వేర్పాటువాదులతో చర్చలకి సిద్ధపడటం చాలా తప్పేనని వేర్పాటువాదులే నిరూపించి చూపారు. కనుక ఇప్పటికైనా వారితో కఠినంగా వ్యవహరించడం చాలా అవసరం. వారి వలనే కాశ్మీర్ సమస్య రావణకాష్టం లాగా రగులుతోందని తెలిసి ఉన్నప్పుడు మళ్ళీ వెళ్లి వాళ్ళ కాళ్ళే పట్టుకోవడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. దేశ గౌరవం..దేశ ప్రజల గౌరవం పోగొట్టుకోవడం తప్ప.