సెప్టెంబర్ 10న ఏపి బంద్! పవన్ కళ్యాణ్ ఏమి చేస్తాడో?

ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా అందుకు ఏమాత్రం తీసిపోని ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇస్తామని నిన్న ఉదయం నుంచి చాలా ఊరించిన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చివరికి ఏమీ ప్రకటించకుండా ఏపికి సాయం చేస్తామని చెప్పి చేతులు దులుపుకోవడంతో ఏపిలో ప్రతిపక్షాలని, ప్రజలని రెచ్చగొట్టినట్లయింది. కనీసం ఆ ప్రత్యేక ప్యాకేజిలో రాష్ట్రానికి ఏమేమి ఇవ్వబోతున్నారనే విషయం కూడా అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్పకపోవడంతో ఏపిలో మళ్ళీ ప్రత్యేక ఉద్యమజ్వాలలు రగులుకొన్నాయి. సెప్టెంబర్ 10వ తేదీన ఏపి బంద్ కి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మిగిలిన ప్రతిపక్ష పార్టీలు కూడా అందుకు మద్దతు తెలపొచ్చు కనుక బంద్ విజయవంతం కావడం తధ్యం.

నేటి నుంచి ప్రారంభం అయిన ఏపి శాసనసభ సమావేశాలలో కూడా ప్రస్తుతం దీనిపై చాలా గొడవ జరుగుతోంది. ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలని మరొక్కసారి మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభని స్తంభింపజేస్తున్నారు. ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజి తీసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధపడటం సిగ్గు చేటని జగన్ విమర్శించారు. పైగా అరుణ్ జైట్లీ ప్రకటనని ముఖ్యమంత్రి స్వాగతించడం ఇంకా తప్పని వాదించారు. పదే పదే రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారని జగన్ అన్నారు.

ప్రత్యేక హోదా కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రంగంలో దిగుతున్నారు. ఆయన రేపు సాయంత్రం కాకినాడలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అది కూడా ప్రత్యేక హోదా కోసమే. ప్రత్యేక హోదా సాధించేందుకు స్వయంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పర్యటించి, ప్రజలని చైతన్యపరిచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలు మొదలుపెడతానని పవన్ కళ్యాణ్ తిరుపతి సభలోనే ప్రకటించారు. ఒకపక్క ప్రతిపక్షాలు, మరోపక్క అపార ప్రజాధారణ కలిగిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు మొదలుపెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తట్టుకోవడం చాలా కష్టమే.

ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి బహుశః తెదేపా కూడా భాజపాతో తెగతెంపులు చేసేసుకొని ప్రతిపక్షాలుతో కలిసి ఉద్యమాలలో పాల్గొని తద్వారా ప్రజాగ్రహం తనపైకి మళ్ళకుండా తప్పించుకొనే ప్రయత్నం చేస్తుందేమో? ఇంత జరిగిన తరువాత తెదేపా ఏమి చేసినా ప్రజల నమ్మకం పొందడం కష్టమేనని చెప్పవచ్చు. దాని ముందు ఒకే ఒక మార్గం ఉంది. ప్రత్యేక హోదాకి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రత్యేక ప్యాకేజి సాధించి దాని గురించి భాజపా, వీలైతే పవన్ కళ్యాణ్ సహాయంతో ప్రజలకి నచ్చజెప్పుకోవచ్చు. మరి తెదేపా, భాజపాలు ఏవిధంగా ఈ సమస్య నుంచి బయటపడతాయో మరికొన్ని రోజులలోనే తేలిపోతుంది.