యూపిలో తప్పటడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ

భాజపాకి గుజరాత్ ఏవిధంగా పుట్టినిల్లు వంటిదో అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పుట్టినిల్లు వంటిది. గుజరాత్ లో గత రెండు దశాబ్దాలుగా భాజపాయే రాజ్యం ఏలుతోంది, కానీ యూపిలో గత 27 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా బ్రతుకుతోంది. ఏ పార్టీకైనా అధికారం ఆక్సిజన్ వంటిది. కాంగ్రెస్ పార్టీకి అది లేకపోవడంతో ఆ రాష్ట్రంలో జీవచ్ఛవంగా ఉంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా యూపి శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ఆ రాష్ట్రంలో మళ్ళీ అధికారం దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి అవకాశంగా భావించవచ్చు. అందుకే ఈసారి అని పార్టీల కంటే చాలా ముందుగానే సన్నాహాలు మొదలుపెట్టేసింది. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా మొదటి నుంచే తప్పటడుగులు వేస్తోంది.

ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే కాంట్రాక్టు, ఎన్నికల వ్యూహ నిపుణుడుగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ కి అప్పగించేసింది. ఆయన రాహుల్ గాంధీని పక్కనపెట్టేసి ప్రియాంకా వాద్రాకి ప్రచార బాధ్యతలు అప్పగించమని సలహా ఇచ్చేసరికి షాక్ అయ్యింది. కానీ అలా చేస్తే ఉజ్వల భవిష్యత్ ఉన్న రాహుల్ గాంధీని ఇక ఎవరూ పట్టించుకోరనే భయంతో ఆ సలహాని పట్టించుకోలేదు. కానీ మూలనున్న ముసలమ్మ షీలా దీక్షిత్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించామన్న సలహాని మాత్రం గుడ్డిగా పాటించేసింది. ఆమెకి హిందీ సినిమాలు చేసుకొనే రాజ్ బబ్బర్ ని రధసారధిగా తోడిచ్చి పంపించారు. వారిద్దరూ కలిసి రాష్ట్రంలో జీవచ్ఛవంలా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసి మళ్ళీ యుద్ధానికి సన్నద్ధం చేయాలట! సాధ్యమేనా...అంటే ఏమో! అంటున్నారు కాంగ్రెస్ నేతలే.

ఓం కాశీనాథా..అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి కంచుకోట వంటి వారణాసిలోనే మొదట ఎన్నికల ప్రచారం ప్రారంభించి ఆయనకి పెద్ద షాక్ ఇవ్వాలని బయలుదేరిన సోనియా గాంధీ, వైరల్ ఫీవర్, డీ హైడ్రేషణ్ కి గురయ్యి ప్రచార రథంలోనే స్పృహ తప్పి పడిపోతే, మళ్ళీ ఆమెని మోడీయే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి  రప్పించి వైద్య చికిత్స చేయించవలసి వచ్చింది. ఆమె ప్రచారంతో కాంగ్రెస్ పార్టీకి ఒరిగిందేమీ లేకపోయినా, ఆమెకి స్పెషల్ ప్లేన్ పంపించి ఢిల్లీ రప్పించినందుకు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ చేత జి.ఎస్.టి.బిల్లుపై ఆమోదముద్ర వేయించుకోగాలిగారు మోడీ.      

రాహుల్ గాంధీ నిన్న ఎంట్రీ ఇచ్చి యూపిలో డియోరియా నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర ప్రోగ్రాం పెట్టుకొన్నారు. ప్రశాంత్ కిషోర్ సలహాని పాటించి, వెరైటీ కోసం 2,000 నులక మంచాలు ఏర్పాటు చేసి వాటిపై  రైతులని కూర్చోబెట్టి సమావేశం జరిపితే, ఆయన ఏమి చెపుతున్నారో వారు పట్టించుకోలేదు కానీ ఆయన లేచి నిలబడగానే ఆయన కూర్చొన్న మంచంతో సహా ఎవరికి దొరికిన మంచం వారు పట్టుకొనిపోవడంతో అదే హాట్ న్యూస్ అయిపోయింది.