
ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో భాజపా నేతలు ఇంచుమించు ఒకేలా మాట్లాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండు రాష్ట్రాలలో ఆ పార్టీ నేతలు తెదేపాతో చేతులు కలపకుండా ఉండి ఉంటే తామే అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లమని, తెదేపాతో చేతులు కలపడం వలనే తాము తీవ్రంగా నష్టపోయామన్నట్లు మాట్లాడుతుంటారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తెదేపాతో చేతులు కలపకుండా భాజపా ఒంటరిగా పోటీచేసినా చాలా ఘోరంగా ఓడిపోయింది. నిజానికి భాజపాకి తెలంగాణ లో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే మంచి పట్టు ఉంది. కానీ అక్కడ కూడా తమ సత్తా చాటుకోలేక చతికిలపడిపోయింది. అంటే తెదేపాతో పొత్తుల కారణంగా ఓడిపోలేదని స్పష్టం అయ్యింది.
అంతకు ముందు 2014 ఎన్నికలలోను భాజపా తన సత్తా చూపించుకోలేకపోయింది. ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికలలోనూ చతికిలపడుతూనే ఉంది. ఓటుకి నోటు కేసు కారణంగా తెలంగాణ లో బద్నాం అయిన తెదేపాతో చేతులు కలపడం వలన కొంత నష్టపోయుండవచ్చు కానీ భాజపా పరాజయాలన్నిటికీ తెదేపాయే కారణం అంటే నమ్మశక్యంగా లేదు. ఇప్పుడు తెలంగాణ లో తెదేపా, భాజపాలు దూరంగా ఉంటున్నాయి. అయినప్పటికీ తెదేపాతో పోలిస్తే భాజపా తన ఉనికిని చాటుకోవడంలో కూడా విఫలం అవుతుండటం గమనించవచ్చు. వివిధ సమస్యలపై భాజపా కంటే రేవంత్ రెడ్డి, ఎల్ రమణ వంటి తెదేపా నేతలే గట్టిగా మాట్లాడుతూ ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించగలుగుతున్నారు. నేటికీ తెదేపా, కాంగ్రెస్ పార్టీలు తెరాస ధాటిని తట్టుకొని ఎదురొడ్డి దానితో పోరాటాలు చేస్తుంటే, భాజపా తెరాసతో పొత్తులకి ఉవ్విళ్ళూరుతోంది. రాష్ట్రంలో భాజపా దుస్థితికి అది అద్దం పడుతోంది.
ఇక ఆంధ్రాలో కూడా భాజపా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ పురందేశ్వరి వంటి భాజపా నేతలు తెలంగాణ భాజపా నేతలలాగే వాపును చూసి బలుపు అని భ్రమపడుతున్నారు. 2014 ఎన్నికలలో ఒకవేళ తెదేపాతో చేతులు కలుపకపోయుంటే తామే అధికారంలోకి వచ్చి ఉండేవారమని ఆమె చెప్పడమే అందుకు ఉదాహరణ. తెదేపా పాలనపై ప్రజలలో వ్యతిరేకత పెరగడం వలన వచ్చే ఎన్నికలలో తెదేపాతో కలిసి పోటీ చేయడం వలన నష్టపోతామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయపడుతున్నట్లు స్పష్టం అవుతోంది.
కానీ ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వంటి కొన్ని హామీలని ఇంతవరకు కూడా అమలు చేయక పోవడం వలన భాజపా పట్ల ఆంధ్రా ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొందనే విషయం ఆమె గ్రహించకపోవడం విచిత్రంగానే ఉంది. రాష్ట్రంలో ఎంతో బలంగా ఉన్న తెదేపా, వైకాపాలే వచ్చే ఎన్నికలలో గెలుస్తామో లేమోనని బెంగపెట్టుకొంటుంటే, ఏమాత్రం బలం, ప్రజాధారణ లేని, ప్రజావ్యతిరేకతని ఎదుర్కొంటున్న భాజపా, ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావచ్చని పగటి కలలు కంటుండటం చాలా విచిత్రంగానే ఉంది.