ఏపికి ప్రత్యేక ప్యాకేజిపై నేడే ప్రకటన?

ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ పోరాటానికి సిద్ధం అవుతున్నందునో లేదా భాజపాతో తెగతెంపులకి తెదేపా సిద్ధపడిన్నందునో లేదా ఈ రెండు కారణాల చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపాకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నందునో...కారణాలు ఏవైతేనేమి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ప్రకటించబోతోంది.

ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనే విషయం కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీల అమలుపై ఈ ప్రత్యేక ప్యాకేజిలో నిర్దిష్టంగా పేర్కొనబోతున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకి 90శాతం నిధులు, దాని కోసమే నాబార్డు నుంచి రూ. 19,000 కోట్ల ఋణం, రాజధాని నిర్మాణం కోసం అదనపు నిధులు, రెవెన్యూ లోటు భర్తీకి ఇస్తున్న నిధుల పెంచడం, అదనంగా పారిశ్రామిక రాయితీలు వగైరాలన్నిటి గురించి నేటి మధ్యాహ్నం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ లో ఒక ప్రకటన చేయబోతున్నారు.         

విభజన చట్టంలో విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామనే హామీ ఇచ్చారు. కానీ ఓడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు అభ్యంతరాలు చెపుతున్న కారణంగా విశాఖలో ఏర్పాటు చేయాలనుకొన్న రైల్వేజోన్ ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి కేంద్రం మొగ్గు చూపుతునట్లు సమాచారం. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందా లేదా? అనే విషయం ప్రకటన వెలువడిన తరువాత తెలుస్తుంది. ఒకవేళ అంగీకరిస్తే చేజేతులా మరొక కొత్త సమస్య తెచ్చుకొన్నట్లే అవుతుంది. ఎందుకంటే ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వబోతున్నట్లు తెలిసినప్పుడే ఏపిలో ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు చాలా గుర్రుగా ఉన్నాయి. ప్రత్యేక హోదా తప్ప వేరే దేనికి అంగీకరించేది లేదని ప్రతిపక్షాలు తెగేసి చెపుతున్నాయి. ఇప్పుడు దానితో బాటు రైల్వేజోన్ తరలింపుపై కూడా ఏపిలో ఉద్యమాలు మొదలైతే రాష్ట్ర ప్రభుత్వం తట్టుకోవడం చాలా కష్టమే అవుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ ప్యాకేజి ప్రకటించింది అంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినట్లే భావించవచ్చు. కనుక దానిలో మంచి చెడులకి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాన బాధ్యతా వహించవలసి ఉంటుంది. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా ఏపికి ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చినా కూడా టిడిపి, బిజెపిలు ప్రజాగ్రహానికి గురయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. పైగా పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కావాలని కోరుతూ ఉద్యమాలకి సిద్ధం అవుతున్నారు. కనుక ఈ ప్యాకేజి వలన ఎంత లాభం ఉందో ఆ రెండు పార్టీలకి అంతే నష్టం కూడా జరిగే అవకాశం కనబడుతోంది.