ఆమాద్మీ పార్టీని సిద్దూ చీపురుతోనే ఊడ్చేస్తున్నాడు

ఆమాద్మీ పార్టీ గుర్తు చీపురు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అది ఘన విజయం సాధించినప్పుడు దేశంలో రెండు అతిపెద్ద జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలని వాటిలో కొమ్ములు తిరిగిన సీనియర్ నేతలని చీపురుతో ఊడ్చి పారేసిందని అందరూ వర్ణించారు. ఇప్పుడు అదే చీపురుతో మాజీ క్రికెటర్, మాజీ బిజెపి ఎంపి నవజ్యోత్ సింగ్ సిద్దూ పంజాబ్ లో ఆమాద్మీ పార్టీని ఊడ్చి పారేస్తున్నాడు. ఆమాద్మీ పార్టీలో చేరేందుకు ఆయనని అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానిస్తే, ఆయన ఏకంగా ఆ పార్టీనే కబళించేస్తున్నాడు.

త్వరలో నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆవాజ్ ఏ పంజాబ్ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నాడు. దానిని ఇంకా స్థాపించకముందే ఆమాద్మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన ఆప్ మాజీ కన్వీనర్ సుచా సింగ్ చోటేపూర్ వచ్చి సిద్దూ టీం లో చేరిపోయాడు. ఆయనతో బాటే మరో అరడజను సీనియర్ ఆమాద్మీ నేతలు కూడా సిద్దూ టీం లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారే కాకుండా అమృత్ సర్ లో ఏకంగా ఒకేసారి 86మంది ఆమాద్మీ పార్టీ ఆఫీస్ బేరర్లు పార్టీకి రాజీనామాలు చేశారు. వారందరూ కూడా సిద్దూ టీంలోనే చేరబోతున్నట్లు సమాచారం. అమృత్ సర్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు, మండలాల నుంచి కూడా ఆమాద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్దూ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సిద్దూ ఇంకా తన పార్టీని లాంఛ్ చేయకముందే అమృత్ సర్ లో ఆమాద్మీ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఇక సిద్దూ పార్టీని ప్రకటించి స్వయంగా రంగంలోకి దిగితే ఆమాద్మీ, మిగిలిన పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించడం కష్టమే. అధికార అకాలీ దళ్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా సిద్దూ టీంలో చేరేందుకు తయారవుతున్నారట! కాంగ్రెస్ పార్టీ సంగతి చెప్పనే అక్కరలేదు. ఎన్నికల లోగానే సగం ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్, బిజెపిలు రెండూ కూడా పంజాబ్ కంటే ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి కనుక వచ్చే ఏడాది జరుగబోయే పంజాబ్ ఎన్నికలలో సిద్దూకి తిరుగు ఉండకపోవచ్చు.