విజయ్ మాల్యాకి ఈడి షాక్! ఇప్పటికైనా భారత్ తిరిగి వస్తాడా?

దేశంలో 17 బ్యాంకులకి రూ.9,000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాని భారత్ తిరిగి రప్పించేందుకు బ్యాంకులు, ఈడి, న్యాయస్థానాలు, విదేశాంగ శాఖ, చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. చివరికి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించినా ఆయన ఖాతరు చేయలేదు. తాను ఎవరినీ మోసం చేయలేదని, కానీ భారత్ లో మీడియా తనపై చేసిన దుష్ప్రచారం వలన ప్రజలలో తన పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందని కనుక ఇప్పట్లో భారత్ తిరిగిరానని మాల్యా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక చేసేదేమీ లేక ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని, దౌత్యహోదా కలిగిన ఆయన పాస్ పోర్ట్ ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకొంది.

మాల్యాని వెనక్కి రప్పించడంలో భారత్ నిస్సహాయతని చూస్తుంటే, ఇటలీ ప్రభుత్వం తన ఇద్దరు ఇటలీ నావికాధికారులని ఏ విధంగా విడిపించుకుపోయిందో జ్ఞాపకం వస్తుంది. వారిద్దరూ తమిళనాడులో సముద్ర తీరంలో చేపలు పట్టుకొంటున్న ఇద్దరు జాలార్లని అకారణంగా కాల్చి చంపినపుడు భారత ప్రభుత్వం వారిని నిర్బంధించింది. అప్పుడు ఇటలీ ప్రభుత్వం భారత్ పై తీవ్ర ఒత్తిడి చేసి వారిద్దరినీ విడిపించుకొని తీసుకుపోయింది. అప్పుడు కూడా భారత్ బలహీనతే బయటపడింది. హత్యా నేరానికి పాల్పడిన వారిద్దరినీ భారత జైల్లో నుంచి ఇటలీ ప్రభుత్వం విడిపించుకు పోగలిగింది కానీ బ్యాంకులని మోసం చేసి లండన్ పారిపోయిన రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యాని భారత్ వెనక్కి రప్పించలేకపోయింది! ఆయన లండన్ లో ఎప్పటికంటే దర్జాగా జీవిస్తున్నాడు.

ఈ పరిస్థితులలో విజయ్ మాల్యా మిగిల్చిన చిన్న చిన్న అవకాశాలని ఉపయోగించుకొని ఈడి ఆ నష్టం పూడ్చుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాలలో ఆయనకి ఉన్న స్థిర, చరాస్తులని ఈడి అటాచ్ చేసింది. తాజాగా చేసిన అటాచ్ మెంట్ విలువ 2010 లెక్కల ప్రకారం రూ. 4,200 కోట్లు ఇప్పటి విలువ ప్రకారం సుమారు రూ.6,630 కోట్లు వరకు ఉంటాయని తేలింది. ఇదివరకు ఒకసారి ఈడి రూ.1,400 కోట్లు విలువ చేసే మాల్యా ఆస్తులని అటాచ్ చేసింది. వాటితో కలిపి చూసుకొంటే ఇంతవరకు మొత్తం రూ.8,030 కోట్లు రాబట్టుకోగలిగింది. ఇంకా మరో రూ.970 కోట్లు రాబట్టుకోవలసి ఉందన్న మాట. కనీసం, అప్పటికైనా విజయ్ మాల్యా దేశానికి తిరిగి వస్తాడో లేదో తెలియదు కానీ ఒకవేళ విజయ్ మాల్యా ఎప్పటికైనా భారత్ తిరిగి వస్తే, బ్యాంకులని, ప్రభుత్వాన్ని, న్యాయస్థానాలని, ఈడిని, పాస్ పోర్ట్ కార్యాలయాన్ని, రాజ్యసభని అవమానించినందుకు, ధిక్కరించినందుకు, దేశ గౌరవానికి భంగం కలిగించినందుకు ఎంత శిక్ష వేస్తే సరిపోతుందో ఎవరైనా చెప్పగలరా?