
భాజపాకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపి, క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ‘ఆవాజ్ ఏ పంజాబ్’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. మాజీ హాకీ క్రీడాకారుడు పర్గత్ సింగ్, బెయిన్ సోదరులుగా పంజాబ్ ప్రజలకి సురపరిచితులైన సిమర్జీత్ సింగ్ బెయిన్, బల్వీందర్ సింగ్ బెయిన్, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిసి సిద్దూ ‘ఆవాజ్ ఏ పంజాబ్’ పార్టీని ఏర్పాటు చేస్తున్నాడు.
నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆమాద్మీ పార్టీలో చేరేందుకే భాజపాకి గుడ్ బై చెప్పేసి బయటకి వచ్చారు. కానీ వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తన పేరుని ప్రకటించాలని, తన భార్యకి కూడా టికెట్ కేటాయించాలని సిద్దూ పట్టుబట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమాద్మీ పార్టీ అందుకు అంగీకరించకపోవడంతో అందులో చేరలేదు. ఈ సంగతి తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఆహ్వానం పలికింది. సిద్దూ కోరినట్లు రెండు టికెట్స్ ఇస్తామని, పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కీలక పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతున్న సిద్దూ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ని కూడా తిరస్కరించడంతో ఏ పార్టీలో చేరబోతున్నాడోనని అందరూ ఎదురుచూస్తుంటే స్వయంగా తనే పార్టీ పెట్టేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు.
ముఖ్యంగా తనని సాదరంగా ఆహ్వానించిన ఆమాద్మీ పార్టీనే సిద్దూ పెద్ద దెబ్బ కొట్టబోతున్నాడు. ఆ పార్టీ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన సుచ్ సింగ్ చోటేపూర్ ని తన కొత్త పార్టీలో చేర్చుకొంటున్నట్లు ప్రకటించాడు. అంతే కాదు పంజాబ్ లోని ఆమాద్మీ పార్టీకి చెందిన అనేక మంది నేతలని, వారి అనుచరులని కూడా తన పార్టీలో చేర్చుకోబోతున్నాడు. సిద్దూ కొట్టబోతున్న ఈ దెబ్బకి పంజాబ్ లో ఆమాద్మీ పార్టీ పూర్తిగా కుప్పకూలిపోయే ప్రమాదం ఏర్పడింది. పంజాబ్ లోని అధికార అకాలీ దళ్ పార్టీ నుంచి కూడా కొందరు నేతలు ‘ఆవాజ్ ఏ పంజాబ్’ లో చేరబోతునట్లు తాజా సమాచారం.
సిద్దూ ఇచ్చిన షాక్ నుంచి ఆమాద్మీ పార్టీ తేరుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు. సిద్దూ ఎంట్రీతో పంజాబ్ లో కాంగ్రెస్, భాజపా, అకాలీ దళ్ పార్టీలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది.