
ఏపి అసెంబ్లీలో తీవ్ర కలకలాన్ని రేపిన నగరి ఎమ్మెల్యే రోజా మొత్తానికి క్షమాపణలు కోరుతూ లేఖ రాసింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన రోజా క్షమాపణలు కోరుతూ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసినట్లు అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్లారు రోజా. కాగా అంతకు ముందు ఈ విషయంపై అసెంబ్లీలోనే తేల్చుకోవాలని రోజాకు హై కోర్ట్ సలహా ఇచ్చింది. దాంతో ఆమె సుప్రీం కోర్టుకు వెళ్లారు.
రోజా క్షమాపణలు చెప్పేంత వరకు తగ్గేది లేదని అసెంబ్లీలో అధికారపక్షం నాయకులు ముందే తెగేసి చెప్పారు. తాజాగా ఆమె రాసిన క్షమాపణ లేఖపై స్పీకర్ ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి. కాగా మరో సహచర ఎమ్మెల్యే అనితపై కూడా రోజా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తన మాటలకు బాధపడి ఉంటే అందుకు కూడా తాను క్షమాపణలు కోరుతున్నానని అని రోజా లేఖలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా క్షమాపణలు చెప్పేది లేదని చెప్పిన రోజా రాజీబాటపట్టినట్లు కనిపిస్తోంది.