
సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు పవన్ కళ్యాణ్ పై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలు సరిగ్గా ఆడటం లేదు కనుకనే ఆయన ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలుపెట్టడానికి సిద్ధం అయ్యాడని అన్నారు. లేకుంటే రెండేళ్లుగా ప్రత్యేక హోదా గురించి ఏపిలో అన్ని పార్టీలు పోరాడుతున్నా ఏనాడూ దాని గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడని పవన్ కళ్యాణ్ ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు పోరాటం మొదలుపెడుతున్నట్లు? అని ప్రశ్నించారు. ఆయనకి ప్రత్యేక హోదా సాధించాలనే తపన, చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఒత్తిడి చేయాలని అన్నారు.
పవన్ కళ్యాణ్ కాపులకి అండగా నిలబడకపోవడాన్ని కూడా హనుమంత రావు తప్పు పట్టారు. “కాపు కులస్తుడైన పవన్ కళ్యాణ్ కాపులకి రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి ఎందుకు మద్దతు పలకడం లేదు. పైగా ఆయన ఉద్యమాన్ని అణగదొక్కేందుకే ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలుపెడుతున్నారని ఆనుమానం కలుగుతోంది,” అని అన్నారు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ కి నిజంగా ప్రజల తరపున నిలబడి పోరాడాలనే కోరిక ఉన్నట్లయితే, సినిమాలు చేయడం మానుకొని రాజకీయాలలోకి వస్తే మంచిదని అన్నారు. సగం సినిమాలు, సగం రాజకీయాలు చేయడం వలన ప్రజలకి న్యాయం చేయలేరని హనుమంత రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా విషయంలో హనుమంత రావు అడుగుతున్న ప్రశ్నకి పవన్ కళ్యాణ్ వద్ద కూడా సమాధానం ఉండదు. దాని గురించి ఆయనని మీడియా ప్రతినిధులు చాలాసార్లు నిలదీసినా సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. కనుక హనుమంత రావు అనుమానిస్తున్నట్లుగా ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకే చంద్రబాబు ప్రోత్సాహంతోనే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పోరాటానికి సిద్ధం అవుతున్నారేమో?
అయితే ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వకపోతే అందుకు అతనిని తప్పు పట్టలేము. నిజానికి ముద్రగడ ఉద్యమానికి ఏపిలో ప్రతిపక్ష పార్టీలు కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయి తప్ప నేరుగా అందులో పాల్గొనడం లేదు. కనుక ఈ విషయంలో పవన్ కళ్యాణ్ న్ని తప్పు పట్టలేము.
పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేయాలనుకొంటే సినిమాలకి స్వస్తి చెప్పి రాజకీయాలలోకి రావాలనే హనుమంత రావు సూచన సరైనదే. చిరంజీవి, బాలకృష్ణలా ‘పార్ట్ టైం-ప్రజాసేవ’ చేయాలనుకొన్నట్లయితే, జనసేన పార్టీ సారధ్య బాధ్యతలని వేరేవరికైనా అప్పగించవలసి ఉంటుంది. రెండు పడవల ప్రయాణం వలన అటు సినిమాలపైనా పూర్తిగా దృష్టి పెట్టలేరు...ఇటు రాజకీయాల పైనా దృష్టి పెట్టలేకపోవడం వలన రెంటిలో ఎదురుదెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కనుక పవన్ కళ్యాణ్ సినిమాలో, రాజకీయాలో దేనికో ఒకదానికే పరిమితం అయితే బాగుంటుంది.