
కాశ్మీర్ లో అల్లర్లని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ కి తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు, పాక్ ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్తాన్ లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన గురించి ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగా మాట్లాడారు. మొట్టమొదటిసారిగా భారత ప్రధాని తమకి మద్దతుగా మాట్లాడటంతో ఆ ప్రాంతాలలో పాక్ సైన్యం అణచివేతకి గురవుతున్న ప్రజలు మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. గత నాలుగు దశాబ్దాలుగా తాము చేస్తున్న బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటానికి భారత్ మద్దతు ఇవ్వాలని, పాక్ సైన్యం చేతిలో తాము పడుతున్న బాధల గురించి ఐక్యరాజ్యసమితిలో భారత్ గట్టిగా మాట్లాడి తమని ఆదుకోవాలని అక్కడి ఉద్యమకారులు మోడీని కోరారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశం పాకిస్తాన్ కి అర్ధమయ్యే బాషలోనే మాట్లాడి దానిని కాశ్మీర్ లో వేలుపెట్టకుండా కట్టడి చేయాలనే తప్ప, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలలో వేలుపెట్టాలని కాదు. అటువంటి సాహసం చేయరనే చెప్పవచ్చు. కానీ ఆయన తమకి అండగా నిలబడతారనే నమ్మకంతో బలూచిస్తాన్ ఉద్యమకారులు భారత్ సహాయం కోరడంతో పాక్ అప్రమత్తమయింది.
ఆ రోజు నుంచి బలూచిస్తాన్ లో కచ్చి బలోన్, క్వెట్టా, డేరా బుగ్టి, మస్టాంగ్, అవరన్ తదితర ప్రాంతాల నుంచి పాక్ సైన్యం రోజూ కొంతమంది ప్రజలను బందీలుగా పట్టుకుపోయి వారిని చిత్రవధ చేసి చంపి, వారి శవాలని రోడ్లపై పడేస్తూ ప్రజలని భయభ్రాంతులను చేస్తోంది. పాక్ సైన్యం బలూచ్ ప్రజలపై చాలా ప్రమాదకరమైన ఏసిడ్ చల్లిన తరువాత వారిని చిత్రవధ చేసి చంపుతోందని ఉద్యమకారులు చెపుతున్నారు. మోడీ బలూచ్ కి మద్దతుగా మాట్లాడినప్పటి నుంచి ఇంతవరకు బుగ్టీ జిల్లాలో 50కి పైగా ప్రజలు పాక్ సైన్యం చేతిలో హత్య చేయబడ్డారని, మరో 150మంది కనబడటం లేదని ఉద్యమకారులు చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆ చిన్న వ్యాఖ్యల వలన కాశ్మీర్ లో అల్లర్లు నియంత్రణలోకి రాలేదు కానీ బలూచిస్తాన్ లో అమాయకులైన ప్రజలు పాక్ సైన్యం చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మోడీ వారి ప్రస్తావన చేయకుండా ఉండి ఉంటే వారు భారత్ సహాయం కోరేవారు కాదు. ఇంతమంది పాక్ సైన్యం చేతిలో హత్యకి గురయ్యేవారు కారేమో? వారి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ చూపిన సానుభూతి వారి ప్రాణాలని బలిగొంటోందిపుడు. వారిపట్ల మోడీ నిజంగానే సానుభూతి కలిగి ఉన్నట్లయితే వారిని ఆయనే ఆదుకోవాలి. కానీ అందుకోసం పాక్ తో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడాలి. అది సాధ్యం కాదు కనుక కనీసం దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నించి వారిని ఆదుకొనే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లేకుంటే పాక్ సైన్యం చేతిలో బలూచ్ ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు.