ఓటుకి నోటు కేసు నుంచి టిడిపి బయటపడగలదా లేదా?

ఓటుకి నోటు కేసులో మళ్ళీ కదలిక రావడంతో తెదేపా నేతలలో మళ్ళీ గుబులు మొదలైంది. వచ్చే నెల 29లోగా ఈ కేసుని పునర్విచారణ పూర్తి చేయాలని ఏసిబి కోర్టు డెడ్ లైన్ కూడా విధించడంతో ఇంకా భయం పెరిగి ఉండవచ్చు. ఈ కేసులో తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏ-1 నిందితుడుగా ఉన్నారు. కనుక మొదట ఆయన మెడకే ఈ ఉచ్చు మళ్ళీ బిగుసుకోవచ్చు. ఆయనని కాపాడవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడుదే లేకుంటే ఆయన కూడా రేవంత్ రెడ్డితో కలిసి జైలుకి వెళ్ళవలసి వస్తుంది. కనుక ఈ కేసు నుంచి రేవంత్ రెడ్డిని బయటపడేసేందుకు, చంద్రబాబు మళ్ళీ చక్రం తిప్పక తప్పదు. కానీ ఈసారి బాబుని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎవరూ కూడా కాపాడలేరని వైకాపా నేత అంబటి రాంబాబు బల్లగుద్ది చెపుతున్నారు.

ఒకవేళ నిజంగా ఎవరూ కాపాడలేకపోతే, రెండు తెలుగు రాష్ట్రాలలో తెదేపా పరిస్థితి చాలా అగమ్యగోచరంగా మారుతుంది. తెలంగాణ లో ఆ పార్టీ తరపున రేవంత్ రెడ్డి అంత గట్టిగా మాట్లాడే ధైర్యం ఉన్న నేతలే లేరు. మళ్ళీ ఈ కేసు ఊపందుకొంటే సండ్ర వెంకట వీరయ్య వంటివారు కూడా తెదేపాలో నుంచి తెరాసలోకి జంప్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈసారి రేవంత్ రెడ్డికి ఈ కేసులో శిక్ష పడినట్లయితే, ఇక తెలంగాణలో తెదేపా ఆఫీసులకి తాళాలు వేసుకోక తప్పదు. ఒకవేళ రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే ఆయన ఒంటరిగా వెళ్ళాలనుకోరు వీలైతే చంద్రబాబు నాయుడుని కూడా తోడు తీసుకొనిపోవాలని చూస్తారు కనుక పరిస్థితి అంతవరకు రానీయకుండా చంద్రబాబు చక్రం తిప్పక తప్పదు. ఈ కేసులో రేవంత్ రెడ్డి ఏదో విధంగా శిక్ష పడకుండా తప్పించుకొన్నా, దాని ప్రభావం చేత రాష్ట్రంలో తెదేపా ప్రజాధారణ కోల్పోవడం ఖాయం.

ఇదివరకు ఈ కేసులో చిన్న కదలిక వచ్చినా తెదేపా నేతలు అందరూ తెలంగాణ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతోందని ఆరోపించేవారు. కానీ ఈ సారి ఆంధ్రా రాజకీయాలలో పైచెయ్యి సాధించడానికి అక్కడి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసిపియే ఈ కేసుని కదిలించడంతో తెదేపా నేతలు ఎవరిని నిందించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

ఇక ఆంధ్రా తెదేపాలో చాలా మంది బలమైన నేతలున్నప్పటికీ, వారెవరికీ ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం లేదు. బాబు తన వారసుడు నారా లోకేష్ కి ఎంత పుషింగ్ ఇస్తున్నా ఆయన మొద్దబ్బాయిలాగే మిగిలిపోయాడు. కనుక ఒకవేళ ఈ కేసులో బాబు చిక్కుకొంటే, ఏపిలో కూడా తెదేపా చాలా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. డెడ్-లైన్ తో కూడిన ఈ కేసు నుంచి టిడిపి నేతలని చంద్రబాబు నాయుడు ఏ విధంగా బయటపడేస్తారో చూడాల్సిందే.