జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రికి బుద్ధొచ్చిందా?

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఏదో ఒక స్థాయిలో వేర్పాటువాదులకి మద్దతు తెలిపేవే. బహుశః వాటి మద్దతు లేకుండా అధికారంలోకి రాలేమనో లేదా వచ్చినా నిలకడగా అధికారంలో కొనసాగడం కష్టమనో భావించడం వలననే వేర్పటువాదులకి అనుకూలంగా మాట్లాడుతుంటాయేమో. రాజకీయ పార్టీలు అధికారం కోసం వేర్పాటువాదులకి అనుకూలంగా వ్యవహరిస్తుంటే, వేర్పాటువాదులు తమ ఉనికిని చాటుకొంటూ సమాంతర ప్రభుత్వాన్ని నడిపేందుకే వేర్పాటువాదాన్ని ఆశ్రయించినట్లు చెప్పవచ్చు. భారత్ నుంచి కాశ్మీర్ ని విడదీయడం అసంభవమని ఏడు దశాబ్దాలలో రుజువైంది. కనుక మరో ఏడు దశాబ్దాలు పోరాడినా కాశ్మీర్ ని భారత్ నుంచి విడదీయలేమనే సంగతి వేర్పాటువాదులకి కూడా అర్ధమయ్యే ఉంటుంది. అయినా వారు వేర్పాటువాదానికే మొగ్గు చూపడం దేనికంటే తమ ఉనికిని చాటుకోవడానికేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే వారు కూడా ఎన్నికలలో పాల్గొని అధికారం చేపడితే, ఇంత స్వేచ్చ, గుర్తింపు పొందలేరు. పైగా చాలా బాధ్యతాయుతంగా, భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ముందు చేతులు కట్టుకొని నిలబడవలసి ఉంటుంది. అందుకే వారు వేర్పాటువాదానికే మొగ్గు చూపుతున్నట్లు చెప్పవచ్చు.

బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తరువాత రోజు నుంచి పాక్ ప్రేరణతో కాశ్మీర్ లో వేర్పాటువాదులు చెలరేగిపోయారు. మొదట్లోనే వారిని ఉక్కుపాదంతో అణచివేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం వారిపట్ల యధాప్రకారం చాలా ఉదాసీనంగా వ్యవహరించడంతో ఇంతవరకు జరిగిన అల్లర్లలో 63 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. అందుకు ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీనే నిందించక తప్పదు. అయితే నెలన్నర కాలంగా సాగుతున్న అల్లర్లు, 63 మంది మృతి చెందిన తరువాత ఆమెకి పరిస్థితి తన చెయ్యి దాటిపోయిందనే సంగతి అర్ధం అయినట్లుంది.

బహుశః అందుకే మొదట ఆందోళనకారులని “మా పిల్లలు” అని అన్న మహబూబా ముఫ్తీ ఇప్పుడు వారు వేర్పాటువాదులని, వారిపై భద్రతాదళాలు కాల్పులు జరపడం సమంజసమేనని ఈరోజు వాదించడం చాలా ఆశ్చర్యం కలిగించింది. పైగా “పోలీస్ స్టేషన్ల వద్దకి వారేమైనా చాక్లెట్స్ కోసం వెళ్ళారా? పాల ప్యాకెట్లు తెచ్చుకొనేందుకు వెళ్ళారా? పోలీసులు, భద్రతాదళాలపై దాడులు చేస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలా?” అని ప్రశ్నించడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆమె మాటలు వింటుంటే ఈమేనా కొన్ని రోజుల క్రితం బుర్హాన్ వనీని పొరపాటున ఎన్ కౌంటర్ చేయబడ్డాడని, అందుకు భద్రతాదళాలు ప్రజలకి క్షమాపణలు చెప్పుకోవాలని, వారి చేతుల్లో ఉన్న పెల్లెట్ తుపాకులు ప్రభుత్వం తీసేసుకోవాలని కోరారు? అనే అనుమానం కూడా కలుగుతుంది.

ఏమైనప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు రాళ్ళు, తుపాకులు ఏ సమస్యని పరిష్కరించలేవనే సంగతి మహబూబా ముఫ్తీకి చాలా ఆలస్యంగా అర్ధం అయ్యింది. కానీ ఈ వ్యవహారంలో ఆమె చాలా అసమర్ధంగా వ్యవహరించడం వలన కాశ్మీర్ ప్రజలకి, వేర్పాటువాదులకి, స్థానిక మీడియాకి కూడా దూరం అయ్యారు. కనుకనే కేంద్ర ప్రభుత్వం చెయ్యి పట్టుకొన్నారేమో? కాశ్మీర్ లో మళ్ళీ త్వరలో సామాన్య పరిస్థితులు ఏర్పరచడంలో ఆమె విఫలం అయితే ఆ రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రులలో అత్యంత అసమర్ధ ముఖ్యమంత్రిగా ఆమె మిగిలిపోతారని ఖచ్చితంగా చెప్పవచ్చు.