
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పోటీ పడుతున్న ఆర్థిక రాజధాని ముంబై అభివృద్ధితో పాటు అటు నేరాలలోనూ పోటీ పడుతున్నట్లు వుంది. ముంబైలో మహిళలు సురక్షితంగా తిరగవచ్చంటూ గత కొన్ని నెలల క్రితం ఓ సంస్థ ప్రకటించగా, ఈ ఘటన మాత్రం పూర్తిగా అందుకు భిన్నంగా వుంది. ప్రముఖ టీవీ సీరియల్ నటి ప్రతిభా తివారిని నడిరోడ్డు మీద ఓ తాగుబోతు వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ముంబైలో ఇటీవల ఈ ఘటన జరిగింది. 'సాథ్ నిభానా సాథియా' వంటి పలు హిందీ సీరియళ్లతో ప్రతిభా తివారీ గుర్తింపు తెచ్చుకుంది
ఇటీవల కందివాలి హైవేపై రాత్రి పది గంటల సమయంలో ఆమె, తన హెయిర్ డ్రెస్సర్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో ఓ తాగుబోతు వారిని సమీపించి, అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి సతాయింపులతో విసిగిపోయిన ప్రతిభా తివారీ.. ఆ ఆకతాయిని సమీపంలోని పోలీసు స్టేషన్ కు ఈడ్చుకెళ్లి అప్పగించింది. అతడిపై ఫిర్యాదు చేసింది. తాగిన మత్తులో ఆమెను వేధించిన వ్యక్తి కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని తెలిసింది.
ఈ ఘటన గురించి తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రతిభా తివారీ మహిళలు ఇలాంటి ఆకతాయిలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించింది. 'రద్దీగా ఉన్న రోడ్డుపై రాత్రి 10 గంటల సమయంలో ఇలాంటి ఘటన జరగడం నన్ను విస్మయపరిచింది. ఇది నన్ను షాక్ కు గురిచేయడమే కాదు వాస్తవ పరిస్థితి ఏమిటో తెలియజేసింది. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు చేయడానికి మహిళలు భయపడతారని నాకు తెలిసింది. కానీ ఇలాంటివాటిపై వారు పోరాడాల్సిన అవసరముంది' అని ఆమె పేర్కొంది.