
రఘురాం రాజన్ విదేశాలలో ముఖ్యంగా అమెరికాలోని విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారని.. వారితో సన్నిహితంగా మెలుగుతున్నారని.. అమెరికా పౌరసత్వం కూడా ఆయనకి ఉండడంతో ఆయనకు అర్బీఐ గవర్నర్ గా విధులు నిర్వహించే హక్కే లేదని బీజేపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే అదే పదవికి ఏకంగా విదేశాలలోనే జన్మించిన ప్రస్తుత అర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను నియమించడం, ఇప్పుడు కొత్త విమర్శలకు తావిస్తోంది.
రాజన్ అమెరికా పౌరసత్వమున్న వ్యక్తని అరోపణలు గుప్పించిన సుబ్రహ్మణ్యస్వామి, ఇప్పుడు విదేశీ ఐన ఉర్జిత్ పటేల్ విషయంలో నోరు మెదపకపోవడం ఆయన చాకచక్యమా.. లేక కేంద్రం అయనను అడ్డుగా పెట్టుకొని ఇలా ఉర్జిత్ పటేల్ పై నెటిజన్ల నుంచి విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తుందా..? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
కెన్యాలో పుట్టినందుకు ఉర్జిత్ పటేల్‌ను ఎవరైనా విమర్శిస్తే.. అంతకంటే మూర్ఖత్వం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన కెన్యా పౌరుడు ఒకప్పుడు మాత్రమే ఇప్పుడు కాదు. కానీ ఆర్3 (రఘురాం రాజన్) మాత్రం భారత్‌లో పుట్టి, అమెరికా గ్రీన్ కార్డు మీద కొనసాగుతున్నారు. 2007 నుంచి భారత్‌లోనే ఉంటున్నా.. దానిని వదులుకోవడం లేదు' అని స్వామి ట్విట్టర్‌లో విమర్శించారు. రఘురాం అనగానే విమర్శలతో ఒంటికాలిపై లేచే స్వామి.. ఆయనను ఉద్దేశించి 'ఆర్3' అంటూ విమర్శలు గుప్పించారు. ఆయన అమెరికా అనుకూలుడంటూ దుయ్యబట్టారు. అయినవారికి ఆకుల్లో పెట్టి, కానీ వారికి కంచాల్లో పెట్టడం మన రాజకీయ నాయకులకు బాగా తెలిసిన విషయమని ఈ అంశంలో ఋజువైందన్న విమర్శలు వినబడుతున్నాయి.