
పెట్రోల్ బావుల గురించి వినడమే గానీ కళ్లారా చూడటం మాత్రం భారత్ దేశంలో పుట్టిన వారి వల్ల మాత్రం కాదు. ఏదో సౌదీలో మాత్రం ఉన్నాయంటూ పాత చిత్రాలలో హీరోలు చెప్పగా వినడమే గానీ.. అక్కడ కూడా బావుల్లోంచి పెట్రోల్ తోడుకోవడం, దానిని చూడటం మాత్రం అరుదనే చెప్పాలి. అయితే బీహార్ లోని గయాలో మాత్రం అది నిజమైంది. ఓ పురాతన బావిలో నీళ్లు ఉంటాయని భావించి బొక్కెన వేసి తోడారు స్థానికులు. కానీ ఆ బావిలో నీళ్లకు బదులు పెట్రోల్ లాంటి చమురు లభించింది. అంతే ఆ వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకి పోయింది.
స్థానికులు పెద్ద సంఖ్యలో బకెట్లు, బిందెలు వేసుకొని బావి చుట్టూ ఫ్రీగా లభించే చమురు కోసం మూగారు. తమ వాటా చమురు కోసం పోటీపడ్డారు. ఈ ఘటన బిహార్లోని గయా నగరంలో చోటుచేసుకుంది. ఈ సమాచారం తెలియడంతో బీహార్ ప్రభుత్వం కూడా స్పందించింది. బావిలో పెట్రోల్ తరహా చమురు లభిస్తున్నట్టు తెలిసిందని, దీంతో బావిని స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఎస్ఐ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. ఈ బావిని పరిశీలించడానికి త్వరలోనే ఓ నిపుణుల బృందం రానుందని ఆయన చెప్పారు.