
దేశంలో బీజేపీ పడినన్ని కష్టాలు మరే పార్టీ పడలేదన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ మేరకు రెండు ట్వీట్లు చేశారు. మొదటిదాంట్లో 'అసతోమా సద్గమయ.. తమసోమా జ్యోతిర్గమయ.. మృత్యోర్మా అమృతంగమయ.. ఓం శాంతి శాంతి శాంతిః' అనగా.. రెండో ట్వీట్లో కూడా వేదాంతాన్నే వల్లించారు. మోదీ చెప్పినది వాస్తవం కాదని రాహుల్ ఈ వేదాంతాన్ని చెప్పినట్లు తెలుస్తుంది.
అయితే.. రాహుల్ ఏం చెప్పాలనకున్నారో.. కానీ.. ఆయన ట్విట్లలో స్పష్టత అర్థం కాకపోవడంతో కాస్త గందరగోళం నెలకొంది. బ్రిటిష్ హయాంలో కాంగ్రెస్ పార్టీ కూడా తాము పడినన్ని కష్టాలు పడలేదని మోదీ అన్నారు. ఢిల్లీలో బీజేపీ కొత్త ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసే సమయంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దాన్ని విమర్శించడానికి రాహుల్ ప్రయత్నించారు. ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో నరేంద్రమోదీపై రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. సూటు-బూటు సర్కారు అని ఒకసారి, '56 అంగుళాల ఛాతీ' కాస్తా 5.6 అంగుళాలకు తగ్గిపోయిందని మరోసారి రాహుల్ అన్నారు.