
ఒక వ్యక్తి తనకి అసభ్యకరమైన ఫోన్ మెసేజులు పంపిన సంగతి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ స్వయంగా ఫేస్ బుక్ ద్వారా తెలిపినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు. రాష్ట్రపతి కుమార్తెకే ఆకతాయిల నుంచి వేధింపులు తప్పకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏమిటనే ప్రశ్న అందరికీ కలిగింది. ఆ తరువాత ఆ నిందితుడి తండ్రి ఆమెకి ఫేస్ బుక్ ద్వారానే ఒక మెసేజ్ పెట్టాడు. దానిలో తన కొడుకు ఒక మానసిక రోగి అని అతనికి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నామని తెలిపి తన కొడుకు చేసిన పనికి ఆమెని క్షమాపణలు కోరాడు. కానీ శర్మిష్ఠ ముఖర్జీ అతనిని ముందు పోలీసులకి అప్పగించమని సూచించారు.
రాష్ట్రపతి కుమార్తె తరువాత ఇప్పుడు అటువంటి చేదు అనుభవమే విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వికె సింగ్ భార్య భారతికి ఎదురయింది. ప్రదీప్ చౌహాన్ అనే వ్యక్తి మంత్రిగారి ఇంటికి ఫోన్ చేసి తను ఆమెకి బందువునని, తన వద్ద ఆమెకి చెందిన అభ్యంతరకరమైన కొన్ని ఆడియో వీడియో టేపులు ఉన్నాయని, రెండు కోట్లు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెట్టి మంత్రిగారి కుటుంబం పరువు తీస్తానని బెదిరించాడు. అయితే మంత్రి గారి భార్య కూడా శర్మిష్ఠ ముఖర్జీ లాగే ధైర్యంగా ఢిల్లీ లోని తుగ్లక్ రోడ్డులోగల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఈ రెండు కేసులలో బాధితులు ఉన్నత కుటుంబాలకి చెందిన వ్యక్తులే. వారికి కూడా ఇటువంటి బాధలు తప్పకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశంలో కోట్లాది మంది సామాన్య మహిళలు కూడా ఇటువంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. ఈ రెండు సంఘటనలు ఇప్పుడున్న నిర్భయ చట్టం కూడా నియంత్రించలేకపోతోందని స్పష్టం చేస్తున్నాయి. కనుక ప్రభుత్వం మరింత కఠినమైన చట్టాలు అమలులోకి తీసుకురావడం చాలా అవసరం.