
దేశ రాజధానికి అత్యంత సమీపాన ఉన్న రాష్ట్రాల్లో వలసదారులు అధికం కావడం చేత మహానగరానికి వచ్చిన కొత్తవారు, పేదరికంలో మగ్గేవారు అడవారిపై అఘాయిత్యాలకు, అత్యాచారాలకు తెగబడుతున్నారంటే చిత్రం కాదేమో, కానీ చదువుకుని అందులోనూ మేనేజర్ స్థాయి ఉద్యోగులు కూడా అత్యాచారాలకు తెగబడటం దారుణం. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ డ్యాన్సర్ పై నలుగురు ఉన్నత స్థాయి ఉద్యోగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వీరంతా ఓ ప్రముఖ ఆయుర్వేద మందుల కంపెనీకి చెందినవారని తెలుస్తోంది.
లక్నోకు 20 కిలోమీటర్ల దూరంలోని బాంథారాలో తమ కార్యాలయానికి సంబంధించి ఓ హోటల్ లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో సత్యవీర్ సింగ్, దేవ్ రాజ్ సింగ్, రాష్ట్రీయ భూషణ్ భారతీ, పరేశ్ తోమర్ అనే నలుగురు మేనేజర్ స్ధాయి ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సత్యవీర్ సింగ్ అనే వ్యక్తి అష్ఫాక్ అనే వ్యక్తి ద్వారా పార్టీలో డ్యాన్స్ చేసేందుకు ఓ ట్రూప్ కావాలని కోరాడు. దీంతో ఆ ఏర్పాట్లు పూర్తయ్యాయి. తన బృందంతో వచ్చిన డ్యాన్సర్ అర్ధరాత్రి గడిచే వరకు ఆడిపాడింది. ఇది చూస్తూ పార్టీలో ఉన్నవాళ్లంతా బాగా తాగుతూ ఎంజాయ్ చేశారు.
ఈ నలుగురు మాత్రం పీకల దాకా తాగి అక్కడి ఇతర డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో ప్రధాన డ్యాన్సర్ వారిని ప్రశ్నించింది. సత్యవీర్ సింగ్ మాత్రం పేమెంట్ గురించి మాట్లాడుకుందామని ఓ గదిలోకి పిలిచాడు. అతడి మాటలు నమ్మి ఆమె ఆ గదిలోకి వెళ్లగానే అప్పటికే అందులో ఉన్న ముగ్గురు తలుపేశారు. అనంతరం ఆమె తలకు తుపాకీ గురిపెట్టి చంపుతామని బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సిసిటీవీ ఫూటేజ్ అధారంగా నిందితులను గుర్తించి.. నలుగురు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు.