
దేశాన్ని గత 70 ఏళ్లుగా పాలించిన ప్రభుత్వాలు ఇంకా స్వరాజ్యం నినాదంతోనే ముందుకు తీసుకెళ్లడం భాధాకరమని.. ఇకనైనా స్వరాజ్యాన్ని సురాజ్యం దిశగా పయనింపజేసేందుకు ప్రతీ ఒక్క భారతీయుడు కంకణ బద్దుడు కావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. తొలుత రాజ్‌ఘాట్ వద్ద బాపూజీకి మోడీ నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటపై జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించిన ప్రధాని ముందుగా 125 కోట్ల మంది భారతీయులకు నా శుభాకాంక్షలు' అని తెలిపారు.
సంస్కృతి, సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు అని కొనియాడారు. స్వాతంత్ర్యం వెనక లక్షలాది మహానుభావుల త్యాగఫలం ఉందని గుర్తు చేశారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని సంకల్పిద్దామని సూచించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. కృష్ణుడి నుంచి గాంధీ వరకు, భీముడి నుంచి భీంరామ్ అంబేద్కర్ వరకు భారతదేశానికి సనాతన చరిత్ర ఉందని మోదీ ప్రశంసించారు. ముక్కలైన దేశాన్ని సర్దార్ వల్లభాయి పటేల్ ఏకం చేశారని మోదీ గుర్తు చేశారు. జాతి, కులం పేరుతో ఎవరినీ అవమానించవద్దని, సామాజిక న్యాయంతోనే పటిష్టమైన సమాజం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సామాన్యుడి ప్రయోజనాలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే రూ. 350 విలువైన ఎల్‌ఈడీ బల్బులను రూ. 50కే ఇస్తున్నామని, ఎల్‌ఈడీ బల్బుల వినియోగంతో విద్యుత్ ఆదా అవుతుందని చెబుతూ, దేశ వ్యాప్తంగా 77 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే రెండేళ్లలో 18 వేలకుపైగా గ్రామాలకు విద్యుత్ ఇచ్చామని మోడీ తెలిపారు. ఢిల్లీ నుంచి మూడు గంటల ప్రయాణ దూరంలో వున్న గ్రామానికి విద్యుత్ సరఫరాను అందించేందుకు 70 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అయితే తాము అధికారంలోకి రాగానే అగ్రామానికి విద్యుత్ అందించామన్నారు. జన్‌ధన్ పథకం అమలు అసంభవం అన్నారని, 21 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. రెండేళ్ల పాటు కరువు వచ్చినా తట్టుకోగలిగామని, ద్రవ్యలోటు పెరగకుండా జాగ్రత్త పడ్డామని వెల్లడించారు.
చట్టంలో మార్పులు తేకుండానే పని విధానం మెరుగైందన్నారు. గతంలో చాలా వరకు ప్రాజెక్ట్‌లను పునాది వేసి వదిలేశారని, కోట్లాది రూపాయల ప్రజా ధనం వృథా చేశారని, ప్రజా ధనం వృథా కాకూడదనే ప్రాజెక్ట్‌లను కొనసాగిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు బిటి రోడ్లు వేయించాలని తమ ప్రభుత్వం నిశ్చయించుకుందని, ఇందులో భాగంగా తాము అధికారంలోకి రాగానే చర్యలను చేపట్టామన్నారు. తొలుత 60 నుంచి 70 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాన్ని చేపట్టామని, దానిని మరింత వేగవంతం చేసి ప్రస్తుతం రోజుకు 100 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపడుతూ.. అనేక గ్రామాలకు మెరుగైన రోడ్లను ఏర్పాటు చేశామన్నారు. దీంతో ఆయా గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కూడా కలుగుతుందని ప్రధాని చెప్పారు.