ఓబిసి రిజర్వేషన్ కోటాలో మార్పులు చేర్పులు చేసిన కేంద్రం

తెలంగాణలో ముస్లింలకి, దళితులకి చెరో 12శాతం రిజర్వేషన్ కల్పించడానికి కెసిఆర్, ఏపిలో కాపులకి రిజర్వేషన్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ బీసి కమీషన్ శనివారం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని కులాలు, ముస్లింలలో కొన్ని శాఖలకి ఓబిసి హోదా కల్పించింది. తెలంగాణాలోని మున్నూరు కాపులకి విద్యా, ఉద్యోగాలలో ఉన్న రిజర్వేషన్లని రద్దు చేసింది.

ఈ రోజు వెలువడిన ఆ జాబితా ప్రకారం తెలంగాణ లో దాసరి, జంగం, ఒడ్డె, కూర్మి తదితర 87 కులాలని ఓబిసి జాబితాలో చేర్చింది. అలాగే ముస్లింలలో మెహ్తర్, దూదేకుల, లాడ్డాఫ్, పింజరి (నూర్ బాష్), ఖురేషి, ఫకీర్, ఫక్రి,  రాజన్నాల, రాజన్నలు తదితర శాఖలని ఓబిసిలుగా గుర్తించి వారికి ఆ ప్రకారం రిజర్వేషన్లు కల్పించబోతున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది.  

ఆగస్ట్ 11న దీని కోసం గజెట్ నోటిఫికేషన్ వెలువరించి, శనివారం ఆ వివరాలని జాతీయ బీసి కమీషన్ వెబ్ సైట్లో పెట్టింది. దాని ప్రకారం ఆంధ్రాలో మొత్తం 109, తెలంగాణలో మొత్తం 87 కులాలు, మతాలు వాటి ఉపశాఖలని ఓబిసిలుగా గుర్తించింది.