దేశంలో దళితులపై దాడులు రాజకీయ కుట్రేనా?

దేశంలో దళితులపై దాడులు జరుగుతున్న వార్తలని ఇప్పుడు తరచూ వింటున్నాము. గోసంరక్షక్ పేరుతో కొత్తగా పుట్టుకొచ్చిన ఒక సంస్థకి చెందిన కార్యకర్తలే దళితులపై దాడులు చేస్తున్నారని, వారు అర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ సభ్యులేనని, దళితులపై పేటెంట్ హక్కులు పొందినట్లుగా భావిస్తున్నరని, కొన్ని పార్టీలు, వాటి నేతలు, ఇతర పార్టీలు, మీడియాలో ఒక వర్గం కూడా వాదిస్తోంది. అయితే ఇది భాజపాకి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా కనిపిస్తోంది. ఉదాహరణకి మూడు రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు దళితులపై జరిగిన సంఘటనే చూస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది.

ఒక స్థానిక వ్యాపారికి చెందిన ఆవు చనిపోతే దానిని తీసుకొన్న ఇద్దరు దళితులు దానిని ఊరు బయటకి తీసుకుపోయి దాని చర్మం ఒలుస్తుంటే, అదే ఊరికి చెందిన 8మంది వ్యక్తులు వారిపై దాడి చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఊహించని విషయం బయటపడింది. ఆ ఊరులో కొన్ని ఆవులు మాయం అవడంతో ఆవు చర్మం ఒలుస్తున్న ఆ దళితులే ఆ దొంగతనాలకి పాల్పడుతున్నారనే అనుమానంతోనే వారిపై దాడి చేసినట్లు పోలీసులకి చెప్పారు. కానీ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు తెదేపా, భాజపా కార్యకర్తలే ఆ దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తుంటే, జాతీయ మీడియాలో ఒక వర్గం ఈ వాస్తవాలు తెలుసుకోకుండా గోసంరక్షక్ దళానికి చెందిన 100 మంది ఈ దాడికి పాల్పడ్డారని నిరాధారమైన ప్రసారాలు చేస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు, వార్తలు, రాజకీయ పార్టీల ఆరోపణలు సరిగ్గా ఎన్నికలకి ముందు లేదా ఆ సమయంలోనే జరుగుతుండటం గమనిస్తే ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేననే అనుమానం కలుగుతోంది.

బిహార్ ఎన్నికలకి ముందు మోడీ ప్రభుత్వం పాలనతో మత అసహనం పెరిగిపోతోందనే ప్రచారం చాలా జోరుగా సాగింది. అదే సమయంలో దేశంలో వివిధ రంగాలకి చెందిన మేధావులు భావప్రకటన స్వేచ్ఛ లేదంటూ తమ అవార్డులని వాపసు చేయడం మొదలుపెట్టారు. తత్ఫలితంగా బీహార్ ఎన్నికలలో భాజపా ఓడిపోయింది.

మళ్ళీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకి, ఏడాది చివర్లో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. బహుశః వాటిని దృష్టిలో పెట్టుకొనే భాజపాకి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ గోసంరక్షక్-దళితులపై దాడులు కుట్రలు మొదలైందేమో అనే అనుమానం కలుగుతోంది. భాజపాకి కంచుకోట వంటి గుజరాత్ లోనే మొట్టమొదట ఇటువంటి సంఘటన జరగడం, ఆ తరువాత మొన్న ఏపిలో, నిన్న యూపిలో వరుసగా దళితులపై దాడులు జరగడం చూస్తే అదే అనుమానం కలుగుతోంది. కనుక భాజపా,మోడీ ప్రభుత్వం అప్రమత్తం అవడం చాలా మంచిది.