
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు కారణంగానే అమెరికన్ ప్రజలని చాలా ఆకట్టుకొన్నారు. ఇప్పుడు అదే నోటి దురుసు కారణంగా విజయావకాశాలని కాలదన్నుకొంటున్నట్లు కనిపిస్తోంది.
ఈ ఎన్నికల బరిలో దిగిన కొత్తలో ట్రంప్ దేశంలో ముస్లింలు, విదేశీయులపై చేసిన అనుచిత వ్యాఖ్యలని యావత్ ప్రపంచదేశాలు వ్యతిరేకించాయి. వారి కారణంగా అమెరికాలో నిరుద్యోగం పెరుగుతోందనే ట్రంప్ వాదనలతో అమెరికన్ ప్రజలు కూడా ఏకీభవిస్తున్నందున ఆయనని కాదనలేదు. పైగా గత ఆరేడు నెలలలో యూరోప్ దేశాలలో వరుసగా ఉగ్రవాదుల దాడులు జరగడంతో ఆయన అభిప్రాయాలతో అమెరికన్ ప్రజలు కూడా కొంతవరకు ఏకీభవించడంతో ట్రంప్ కి ఆదరణ, బాగా పెరిగింది.
కానీ ఆ నోటి దురుసుతనమే ఇప్పుడు అతని కొంప ముంచుతోంది. మహిళలు, ముఖ్యంగా తన ప్రత్యర్ధి హిల్లరీ క్లింటన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై, తన సొంత పార్టీ నేతలపై ట్రంప్ చేస్తున్న చాలా అనుచితమైన వ్యాఖ్యల వలన అకస్మాత్తుగా ఆయన గ్రాఫ్ పడిపోసాగింది. ఇటీవల హిల్లరీ క్లింటన్ ఆయన కంటే రేసులో ముందుకు దూసుకుపోవడమే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ పరిస్థితిలో ట్రంప్ నష్ట నివారణ చర్యలు చేపట్టకపోగా, హిల్లరీ, ఒబామాలపై ఇంకా తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తను కూర్చొన్న కొమ్మని తానే నరుకొంటున్నట్లు పరిస్థితి ఏర్పడింది.
అమెరికాలో గన్ సంస్క్రతిని సమర్ధించేవారు అందరూ హిల్లరీని అధ్యక్ష భవనంలో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అంటే హిల్లరీ క్లింటన్ ని హత్య చేయమని ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం ప్రజలకి కలిగించారు. హిల్లరీని ఓడించి, తనని గెలిపించమని కోరితే సరిపోయేది. కానీ గన్ సంస్క్రతిని సమర్ధించేవారు ఆమెని అడ్డుకోవాలని చెప్పడంతో అది ప్రజలకి వేరేలా చేరింది. దానితో ఆయన గ్రాఫ్ ఇంకా పడిపోయింది. ఆయన ఆ ఉద్దేశ్యంతో అనలేదని ట్రంప్ ప్రతినిధులు చెప్పుకొన్నప్పటికీ జరుగకూడని నష్టం అప్పటికే జరిగిపోయింది.
అమెరికాలో ప్రజలు తమ దేశాధ్యక్షుడిని చాలా గౌరవిస్తారు. అందుకే ఆయన లేదా ఆమె ఎంపిక విషయంలో ప్రతీ చిన్న విషయానికి చాలా ప్రాధాన్యతనిచ్చి బాగా పరిశీలించి అతను లేదా ఆమె అందుకు అర్హులు, సమర్ధులని భావిస్తేనే పట్టం కడతారు. ఆ తరువాత అమెరికా అధ్యక్షుడి అభిప్రాయాలు, నిర్ణయాలతో వారు ఏకీభవించినా, ఏకీభవించకపోయినా ఆయన లేదా ఆమె పట్ల అదే అభిమానం, గౌరవం ప్రదర్శిస్తుంటారు. తాము గౌరవిస్తున్న అమెరికా అధ్యక్షుడి పట్ల ఎవరు అనుచితంగా, అగౌరవంగా ప్రవర్తించినా వారు సహించరు. ఈ సంగతి ట్రంప్ కి కూడా తెలిసే ఉండాలి. కానీ మళ్ళీ నోరు జారారు. జారారు అనడం కంటే ఓడిపోయే అవకాశాలు పెరిగిన కారణంగా ఆ భయంతో నోటికి వచ్చినట్లు వాగారని చెప్పవచ్చు.
అమెరికా అధ్యక్షుడు ఒబామా పూర్తి పేరు బరాక్ హుస్సేన్ ఒబామా. ఆయన పూర్వీకులు ఆఫ్రికావాసులు. ఈ సంగతి ఆయనని అధ్యక్షుడుగా ఎన్నుకొన్న అమెరికా ప్రజలందరికీ తెలుసు. కానీ ఆయన ఒక ముస్లిం అని దేశ ప్రజలకి నొక్కి చెప్పడం ద్వారా ఆయన సమర్ధిస్తున్న డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ న్ని దెబ్బతీయలనుకొన్నారు.
ఆ ప్రయత్నంలోనే నిన్న ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్ డేల్ లో జరిగిన ఒక ప్రచార కార్యక్రమంలో ఒబామా పూర్తి పేరుని పదేపదే ఒత్తి పలుకుతూ ఆయనే ఐసిస్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు, హిల్లరీ క్లింటన్ సహా వ్యవస్థాపకురాలు అని చెప్పి తన నోటిదురుసుని మరో మారు ప్రదర్శించుకొన్నారు.
దేశ ప్రజలు అందరూ గౌరవించే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి ట్రంప్ ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలని అమెరికన్ ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో, ఏవిధంగా స్పందిస్తారో నవంబర్ లో తెలుస్తుంది. కానీ ఇంత అహంకారం, నోటిదురుసు ఉన్న ట్రంప్ అటువంటి ఉన్నత పదవికి అర్హుడేనా? అధ్యక్షుడు కాకముందే ఇంత అహంకారంతో విర్రవీగుతున్న ఆయన, ఒకవేళ అమెరికా అధ్యక్షుడైతే అతనిని అమెరికా, అక్కడి ప్రజలు, మంత్రులు, అధికారులు, ప్రపంచ దేశాలు భరించగలవా? ఆలోచించవలసిన విషయమే!