
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిన అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ మరో మారు అదే తరహా వ్యాఖ్యలు చేశారు. అయన చేసిన వ్యాఖ్యలను విశ్లేషిస్తున్న లా మేకర్ ట్రంప్ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారని తప్పుబడుతున్నారు. అధ్యక్ష పదవి బరిలో ట్రంప్ కు ప్రత్యర్థిగా నిలిచిన డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను చంపాలన్న సందేశాన్ని ఇచ్చినట్లుగా ఉన్నాయిని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యవాసుల నుంచి ట్రంప్ అధ్యక్ష బరిలో నిలిచేందుకు అర్హుడు కాదని ఆయన తక్షణ పోటీ నుంచి వైదొలగాలని డిమాండ్ పెరుగుతోంది.
తుపాకి లైసెన్స్ ఉన్న ప్రతి అమెరికన్ పౌరుడు హిల్లరీ క్లింటన్ వైట్ హౌస్ కు చేరకుండా ఆపగలరని అభిప్రాయపడ్డారు. దీంతో ట్రంప్ హిల్లరీని కాల్చిచంపాలని సూచిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హిల్లరీ అధికారంలోకి వస్తే అమెరికన్లకు మాత్రమే వర్తించే గన్ లైసెన్స్ 'సెకండ్ అమెండ్ మెంట్'ను తొలగిస్తారని ట్రంప్ విల్మింగ్ టన్ ప్రచార కార్యక్రమంలో అన్నారు. రిపబ్లికన్ ప్రచార కార్యక్రమ నిర్వాహకులు ట్రంప్ వ్యాఖ్యలపై వస్తున్న వార్తలను ఖండించారు.
నిజాయితీ లేని మీడియా ట్రంప్ ప్రచారంపై ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు. సెకండ్ అమెండ్ మెండ్ ద్వారా లబ్ధి పొందుతున్న ఓటర్లు రికార్డు స్థాయిలో ఉన్నారు. వారిని ఆకర్షించడానికే ట్రంప్ ఆ వ్యాఖ్య చేశారే తప్ప మరేం కాదని తెలిపారు. ప్రచార కార్యక్రమం అనంతరం ఆ వ్యాఖ్యలపై ఇంటర్వూ ఇచ్చిన ట్రంప్.. హిల్లరీ క్లింటన్ గెలిస్తే.. సెకండ్ అమెండ్ మెంట్ బిల్లును సుప్రీం కోర్టు ద్వారా రూపుమాపుతానని అన్నారు. గన్ లైసెన్స్ కలిగివున్న వాళ్లందరిలో అఖండ శక్తి ఉందని.. వారికి ఎవరికి ఓటువేయాలో బాగా తెలుసునని చెప్పారు.