పాకిస్తాన్ లో కాశ్మీర్ కలిస్తే ఎవరికి నష్టం?

కాశ్మీర్ లో గత నెల రోజులుగా జరుగుతున్న అల్లర్లపై ప్రతిపక్షాలు ప్రధాన మంత్రి మోడీని గట్టిగా నిలదీయడంతో ఆయన నిన్న నోరువిప్పి మాట్లాడారు.

మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ, “దేశంలో ప్రజలందరూ ఏ విధంగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జీవిస్తున్నారో, కాశ్మీర్ ప్రజలు కూడా అదే విధంగా జీవించే హక్కు కలిగి ఉన్నారు. ల్యాప్ టాపులు, పుస్తకాలు క్రికెట్ బ్యాట్స్ పట్టవలసిన కాశ్మీరీ యువత చేతికి కొందరు రాళ్లు ఇచ్చి అల్లర్లకి ప్రోత్సహించడం చాలా బాధ కలిగిస్తోంది. కనుక ఇప్పటికైనా కాశ్మీరీ యువత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహాయసహకారాలని అందిపుచ్చుకొని తమ భవిష్యత్ ని ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలి. రాష్ట్రంలో మళ్ళీ ప్రశాంతత ఏర్పడేందుకు సహకరించాలి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పద్ధతిలోనే మేము కూడా కాశ్మీరీ ప్రజలతో అనుసంధానం అయ్యి వారి సమస్యల పరిష్కారం కోసం మానవతా దృక్పధంతో కృషి చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలోని అన్ని పార్టీలు, ప్రజలు అందరూ కాశ్మీర్ పట్ల ఒకే స్వరంతో స్పందించడం చాలా శుభపరిణామం. కాశ్మీర్ అంటే భువిపై వెలిసిన స్వర్గం వంటిదని, జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి రావాలని ప్రతీ భారతీయుడు కోరుకొంటాడు. కానీ కాశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. కనుక కాశ్మీర్ లో ప్రజలు, ముఖ్యంగా యువత కాశ్మీర్ కి పూర్వ వైభవం సాధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సహకరించాలి,” అని మోడీ కోరారు.

ఏనాటికైనా కాశ్మీర్ ని తమ దేశంలో కలుపుకోవాలని కోరుకొంటున్నానని, అందుకోసం కాశ్మీర్ లో జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటానికి (అల్లర్లకి) పాక్ పూర్తి మద్దతు ఇస్తుందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా చెప్పారు కనుక ఈ అల్లర్ల వెనుక పాక్ హస్తం ఉందని ఆయనే దృవీకరించారు.

భారత్, పాకిస్తాన్ దేశాలకి ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నేటికీ పాకిస్తాన్ ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. ప్రజా ప్రభుత్వాలపై సైనికాధికారుల కర్ర పెత్తనం చేస్తూ దాని చేతులు కట్టేశారు. కొన్నిసార్లు వారే స్వయంగా దేశాన్ని పాలించారు కూడా. ఈ 60 ఏళ్లలో పాక్ సాధించింది ఏమిటంటే నిరుద్యోగం, ఆ కారణంగా పేదరికం,దుర్బర దారిద్ర్యం, ఆ కారణంగా ఉగ్రవాదం, అరాచకమే తప్ప ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు.

తన ఇంటినే చక్కదిద్దుకోలేకపోతున్న పాకిస్తాన్, ఇంక కాశ్మీర్ ని కూడా కలిపేసుకోవాలని కలలు కనడం ఒక విచిత్రం అనుకొంటే, అటువంటి ధూర్త, దరిద్ర దేశంలో కలిసిపోవాలని కాశ్మీర్ వేర్పాటువాదులు ఉవ్విళ్ళూరడం మరీ విచిత్రంగా ఉంది. ఒకవేళ భారత్ కాశ్మీర్ ని వద్దనుకొని పాకిస్తాన్ కి వదిలి పెట్టేస్తే నష్టపోయేది కాశ్మీర్ ప్రజలే తప్ప భారత్ కాదు. 60 ఏళ్లుగా కాశ్మీర్ కోసం పాక్ ఆరాటపడుతున్నా ఏమీ చేయలేకపోయింది. మరో 600 ఏళ్ళు పోరాడినా ఏమీ చేయలేదు కూడా. ఈ సంగతి కాశ్మీర్ లో వేర్పాటువాదులు ఎందుకు గుర్తించలేకపోతున్నారో తెలియదు. కానీ పాక్ దుష్ప్రభావానికి, రాష్ట్ర రాజకీయ నేతల స్వార్ధానికి లోనై  తమ వర్తమానాన్ని,భవిష్యత్తుని కూడా నాశనం చేసుకొంటూ రక్తం చిందిస్తున్నారు. అందుకు వారిపై జాలిపడక తప్పదు.