ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది బిజెపి తీరు

హైదరాబాద్ లో నిన్న జరిగిన బిజెపి మహా సమ్మేళన్ లో మాట్లాడిన నేతల ప్రసంగాలు వింటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది. ఈ రెండేళ్లలో ఏపి, తెలంగాణ రాష్ట్రాలలో బిజెపి పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో ప్రత్యక్షంగా కళ్ళకి కనబడుతూనే ఉంది. అయినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా బిజెపి జెండాలు రెపరెపలాడుతున్నాయని, భవిష్యత్ బిజెపిదేనని వెంకయ్య నాయుడు చెప్పుకోవడం ఆత్మవంచన చేసుకోవడమే.

ఈ రెండేళ్ళలో తెలంగాణలో జరిగిన ఒక్క ఎన్నికలలో కూడా బిజెపి గెలవలేదు. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలలో నిలబెట్టేందుకు పార్టీలో అభ్యర్ధులు కూడా లేకపోవడంతో డా. దేవయ్యని ‘ఇంపోర్ట్’ చేసుకోవలసి వచ్చింది. అయినా టిఆర్ఎస్ చేతిలో ఓటమి తప్పలేదు. గ్రేటర్ లో బిజెపికి చాలా పట్టుందనుకొంటే అక్కడ టిఆర్ఎస్ చేతిలో పరాభవం తప్పలేదు. తెలంగాణాలో పార్టీ పరిస్థితి బాగోలేదని గ్రహించినందునే టిఆర్ఎస్ తో స్నేహం కోసం అమిత్ షా ప్రయత్నించారు. కానీ కెసిఆర్ తిరస్కరించారు.

ఇక ఆంధ్రాలో బిజెపి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, మిత్రపక్షమైన తెదేపాతో ఎటువంటి వైఖరి అవలంభించాలో తెలియక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించుకోలేకపోతోంది. ప్రత్యేక హోదా తదితర హామీలని అమలుచేయని కారణంగా బిజెపి నేతలు ధైర్యంగా ప్రజల ముందుకి రాలేకపోతున్నారు. ఒకవేళ బిజెపితో తెదేపా కటీఫ్ చేసుకొంటే దాని పరిస్థితి ఇంకా దిగజారిపోవడం ఖాయం.

ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలలో ఒక్క అసోంలో తప్ప మరెక్కడా కూడా భాజపాకి గౌరవప్రదమైన సీట్లు కూడా రాలేదు. కాశ్మీరులో కొనసాగుతున్న అల్లర్ల కారణంగా ఏక్షణంలోనైనా బిజెపి-పిడిపి సంకీర్ణ ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కనబడుతున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ అకస్మాత్తుగా రాజీనామా చేయడం, ఆమె స్థానం విజయ్ రూపనీని నియమించడం దేనికో అందరికీ తెలుసు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బిజెపి పరిస్థితి ఇంత దయనీయంగా కనబడుతుంటే, బిజెపిదే భవిష్యత్ అనుకొంటే ఎవరికి నష్టం?