
దళితులపై దాడి మానవత్వానికి మచ్చ అని, దళితులపై దాడి చేస్తే జాతి మనల్ని క్షమించదని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఈ ప్రపంచం వసుధైక కుటుంబం అని ప్రపంచానికి మనమే చాటి చెప్పాం... మరి అలాంటి మనం దళితులపై దాడి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను కాదు తనను కాల్చాలని వ్యాఖ్యానించారు. దళితులను రక్షించడం మన మధ్యత అని నరేంద్ర మోడీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేసే మంచి పనులు దళితులకు చేరితే వచ్చే 50ఏళ్లు ప్రతిపక్షాలు అడ్రెస్ లేకుండా పోతాయని ఆయన అన్నారు.
గోసంరక్షణ పేరుతో కొంతమంది విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. నకిలీ గోరక్షకులతో అప్రమత్తంగా ఉండాలని చెబుతూ, నకిలీ గోరక్షకులను గుర్తించడంలో నిజమైన గోభక్తులు సహకరించాలని పేర్కొన్నారు. వ్యవసాయంతో గోవులను అనుసంధానం చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని గుర్తుచేస్తూ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ చేసిన ప్రయోగం రైతుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందని చెప్పారు. రోడ్లపై వదిలేసిన గోవులను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రైతులకు అప్పగించారన్నారు.