అధికార పార్టీలో చేరినా హైకోర్టు ఖాతరు చేయలేదేమిటో...

సాధారణంగా ప్రతిపక్ష పార్టీలకి చెందిన ఎమ్మెల్యేలు లేదా పార్టీ నేతలు అధికార పార్టీలోకి మారేటప్పుడు స్టాండర్డ్ గా చెప్పే అబద్ధం ఏమిటంటే ‘ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలని చూసి ఆకర్షితులై వాటిలో తాము పాలుపంచుకోవాలని!’ అది  అబద్ధమని ప్రజలకీ తెలుసు. తాము చెప్పే అబద్ధాన్ని ప్రజలు కూడా నమ్మరని వారికీ తెలుసు కానీ అదీ ఒక కమర్షియల్ సినిమా ఫార్ములా లాగా తయారయిపోయింది కనుక కొత్తగా చెప్పడానికి వారు ప్రయత్నించరు చెప్పినా వినడానికి ప్రజలూ ఇష్టపడటం లేదు.

తెదేపా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా సేమ్ స్టోరీతో తెరాసలో చేరిపోయారు. కానీ కుత్బుల్లాపూర్ లో ఎటువంటి అనుమతులు లేకుండా ఆయన నిర్మించిన భవనాన్ని మాత్రం కాపాడుకోలేకపోయారు. అది అక్రమ కట్టడం అని హైకోర్టు కూడా నిర్ధారించింది. మూడు నెలలోగా దానిని కూల్చి వేయాలని ఆదేశించడంతో జి.హెచ్.ఎం.సి. అధికారులు ఇవాళ ఆ భవనాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం దానిలో ఆంధ్రప్రదేశ్ లో ధనవంతుడైన  మంత్రి గా గుర్తించబడిన నారాయణకి చెందిన నారాయణ కాలేజి నడుస్తోంది. కనుక ఆ కాలేజీని అత్యవసరంగా వేరే చోటికి తరలించక తప్పదు. అధికార పార్టీలో చేరినా ఇంత చిన్న పని చేసుకోలేకపోతే ఇక తెలంగాణాని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఏమో? ఆయన తన భవనం కాపాడుకోగలిగితే అదే పదివేలు.. కనుక దాని కోసం ఏం ప్రయత్నాలు చేస్తారో..చూడాలి!