రాహుల్ గాంధీ ఇంకా ఎప్పుడు మెచ్యూర్ అవుతారో ఏమో?

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి కాలు బయటపెడితే, ఆయన పర్యటన వలన పార్టీకి ఎంతో కొంత మేలు చేకూరుతుందని అందరూ ఆశిస్తారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా నోరుజారి ఏదో మాట్లాడి స్వయంగా వివాదాలలో చిక్కుకోవడమే కాకుండా పార్టీకి కూడా ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తుంటారు.

డిసెంబర్ 2015లో ఆయన అసోం పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ‘బార్పేట సత్ర’ అనే ప్రముఖ వైష్ణవాలయాన్ని సందర్శించాలనుకొన్నారు. కానీ మనసు మార్చుకొని సత్ర అనే ప్రాంతంలో పాదయాత్ర  చేసి తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. డిల్లీ చేరుకొన్నాక అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “ఆర్.ఎస్.ఎస్.కి చెందిన కొందరు నన్ను ఆ ఆలయంలో ప్రవేశించకుండా అడ్డుపడటంతో నేను పాదయాత్ర చేసి వెనక్కి తిరిగి వచ్చేశాను,” అని చెప్పారు.

ఆయన ఆలయం లోకి అడుగు పెట్టకుండానే తనని ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు లోపలకి రాకుండా అడ్డుకొన్నారని చెప్పడంతో అంజన్ బోర అనే ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త గౌహతీ కోర్టులో రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. ఆరోజు రాహుల్ గాంధీ కోసం చాలా మంది ప్రజలు ఆలయం వద్ద చాలా సేపు ఎదురుచూసి ఆయన ఎంతకీ రాకపోవడం వెళ్లిపోయారని, కానీ రాహుల్ గాంధీ తనని ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకొన్నారని అబద్ధాలు చెప్పి తమ సంస్థ ప్రతిష్టకి భంగం కలిగించారని ఆరోపించారు. దానిపై విచారణ చేసిన గౌహతీ కోర్టు రాహుల్ గాంధీని సెప్టెంబర్ 21న జరిగే విచారణకి స్వయంగా హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీస్ జారీ చేసింది.

ఇదివరకు ఒకసారి రాహుల్ గాంధీ మహారాష్ట్రలో భివండీ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక సభలో మాట్లాడుతూ “మహాత్మా గాంధీని ఆర్.ఎస్.ఎస్. హత్య చేయించింది,” అని నోరు జారడంతో ముంబై హైకోర్టులో కూడా ఆయనకి వ్యతిరేకంగా ఒక పిటిషన్ పడింది. క్షమాపణలు చెప్పుకొంటే కేసుని కొట్టివేస్తామని లేకుంటే కొనసాగిస్తామని హైకోర్టు ఆయనకి అవకాశం కల్పిస్తే  “గాంధీ ఫ్యామిలీలో ఎవరూ ఎవరికీ క్షమాపణలు చెప్పుకొనే అలవాటు లేదు,” అని కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పడం విశేషం. కనుక ఏదో ఒక రోజు ఆ కేసుకి కూడా ఆయన హాజరు కావలసి ఉంటుంది. ఒక పార్టీ ఉపాధ్యక్షుడు తన పర్యటనల ద్వారా పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నం చేస్తారు. కానీ రాహుల్ గాంధీ స్టయిలే వేరు..తన పరువు తీసుకోవడమే కాకుండా పార్టీ పరువు కూడా తీస్తుంటారు.