
ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ కి నిరసనగా కాశ్మీరులో జరిగిన హింస ఉగ్రవాదమేనని భారత్, పాకిస్తాన్ ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం చాలా విచిత్రమైన పరిణామమే. కాశ్మీరులో వేర్పాటువాదులని, ఉగ్రవాదులని పాక్ ప్రభుత్వమే అల్లర్లకి ప్రోత్సహిస్తోందని భారత్ వాదిస్తుంటే, భారత్ తన సైన్యంతో కాశ్మీర్ ప్రజలపై చేస్తున్న దాడులు బహిరంగ ఉగ్రవాదం క్రిందే లెక్క అని పాక్ వాదిస్తోంది. భారత్ లో అంతర్భాగంగా ఉన్న కాశ్మీరులో జరుగుతున్న అల్లర్లని కాశ్మీర్ స్వాతంత్ర పోరాటంగా అభివర్ణిస్తున్న పాకిస్తాన్, వారిని నియంత్రించేందుకు భద్రతాదళాలు చేస్తున్న ప్రయత్నాలకి “బహిరంగ ఉగ్రవాదం” అనే కొత్తపేరు కనిపెట్టింది.
కాశ్మీర్ తో సహా దేశంలో చాలాచోట్ల ఇంతవరకు జరిగిన, జరుగుతున్న దాడులకు మూలం, పాకిస్తాన్ దేశస్థులే.. పాక్ ఉగ్రవాద యూనివర్సిటీలో ఉగ్రవాదంలో డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు పుచ్చుకొని వచ్చినవారేనని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. కనుక పాకిస్తాన్ చెపుతున్న ఉగ్రవాదంపై పోరు, ఇరుగుపొరుగు దేశాలతో సహకారం వంటి మాటలన్నీ ప్రపంచ దేశాల ముందు తన పరువు కాపాడుకోవడానికి తయారుచేసుకొన్న పడికట్టు పదాలే. ఆచరణలో పెట్టని వాటికి అర్ధం కూడా లేదు. అదే విషయం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న ఇస్లామాబాద్ సార్క్ సమావేశంలో విస్పష్టంగా చెప్పారు.
గత ఏడాది ఉగ్రవాదులు ఇస్లామాబాద్ లోని సైనిక స్కూలుపై దాడి చేసి అభంశుభం తెలియని అమాయకులైన విద్యార్ధులని అతి కిరాతకంగా కాల్చి చంపినప్పుడు, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ “ఉగ్రవాదులలో మంచి ఉగ్రవాదులు..చెడ్డ ఉగ్రవాదులు ఉండరని, ఉగ్రవాదులు అందరూ చెడ్డవారేనని, వారిని నిర్దాక్షిణ్యంగా అణచి వేయాలని స్వయంగా చెప్పారు. ఆ మాటలనే నిన్న రాజ్ నాథ్ సింగ్ పాక్ ప్రభుత్వానికి గుర్తు చేసి, బుర్హాన్ వనీ వంటి ఉగ్రవాదులని దేశ భక్తులుగా చిత్రీకరించడం తగదని, కాశ్మీర్ లో అల్లర్లకి ప్రోత్సహించడం మానుకోవాలని హితవు పలికారు. కానీ అంత త్వరగా మారితే అది పాకిస్తాన్ ఎందుకు అవుతుంది? 60 ఏళ్ల తరువాత కూడా దాని పరిస్థితి ఇంత దయనీయంగా ఎందుకు ఉంటుంది? భారత్ చెప్పిన హితోక్తులు చెవికెక్కించుకోకుండా, కాశ్మీర్ లో భారతదేశమే బహిరంగ ఉగ్రవాదానికి పాల్పడుతోందని తిరిగి విమర్శలు చేస్తోంది. ప్రపంచదేశాలు నిషేధించిన హిజ్బుల్ ముజుద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలు తుపాకులు పట్టుకొని పాక్ వీధులలో ర్యాలీలు నిర్వహిస్తూ, పాక్ ప్రభుత్వానికే హెచ్చరికలు జారీ చేస్తుంటే, పాక్ ఇంతకంటే వేరే విధంగా ఎలా మాట్లాడగలదు?