పాకిస్తాన్ కి ఐక్యరాజ్యసమితి చెప్పుదెబ్బ

ఇటీవల కాశ్మీర్ లో అల్లర్లని ప్రేరేపించడంలో సఫలం అయిన పాకిస్తాన్, ఆ ఊపులోనే కాశ్మీర్ సమస్యని అంతర్జాతీయ వేదికలపై గట్టిగా మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో ఐక్యరాజ్యసమితి కలుగజేసుకోవాలని కోరింది. ఏనాటికైనా కాశ్మీర్ పాకిస్తాన్ లో విలీనం అవుతుందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పడం, పాక్ దురాలోచానలకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇస్లామాబాద్ లో నిన్న, ఈరోజు జరిగిన సార్క్ సమావేశాలలో కూడా నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి, భారత్ ని నిందించారు. కనుక పాక్ వైఖరి ఎన్నటికీ మారబోదని 101వ సారి ఆ దేశం నిరూపించి చూపింది.

కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా అభివర్ణిస్తున్న పాకిస్తాన్ కి, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ అధికార ప్రతినిధి స్టెఫానే డుజర్రిక్ ఈ రోజు చేసిన ప్రకటనతో చెప్పుదెబ్బ కొట్టినట్లయింది. “కాశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని అందులో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోదని” తేల్చిచెప్పారు. “భారత్, పాకిస్తాన్ దేశాలలో ఉన్న ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలక బృందం పని ఇరు దేశాలు సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తున్నాయా లేదా? వాటిని ఏ దేశం ఉల్లంఘిస్తోంది? అనే సమాచారాన్ని ఐక్యరాజ్యసమితికి నివేదించడమే తప్ప, కాశ్మీర్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వాటి పని కాదని” స్పష్టం చేశారు.

అంతకు ముందు బాన్ కీ మూన్‌ వద్ద సహాయ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ “ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలక బృందం కాశ్మీర్ లో పరిస్థితిని పర్యవేక్షిస్తామని” చెప్పిన మాటని స్టెఫానే డుజర్రిక్ ఖండించారు. అది తమ పని కాదని స్పష్టం చేశారు. కాశ్మీర్ సమస్యని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ కి ఇది చెప్పుదెబ్బ వంటిదేనని చెప్పక తప్పదు.

అయినప్పటికీ దాని తీరు మారలేదు. ఇస్లామాబాద్ లో ఈరోజు జరిగిన సార్క్ సమావేశంలో భారత్ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగాన్ని చిత్రీకరించేందుకు మీడియాని అనుమతించలేదు. కేవలం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ హోం మంత్రి ప్రసంగాలని మాత్రమే ప్రసారం చేసింది. ఆసియా దేశాలు పరస్పరం సహకరించుకొనేందుకే సార్క్ ని ఏర్పాటు చేసుకొన్నారు. కానీ అక్కడా పాక్ తన వక్రబుద్ధిని ప్రదర్శించుకొంది.