రిజర్వేషన్లపై గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో పటేల్ కులస్థులలో వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగాలలో బిసి (ఈ) కోటా క్రింద 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ ఏడాది మే నెలలో ఇచ్చిన ఉత్తర్వులని ఈరోజు గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలోని బిసి సంఘాలు, కొన్ని విద్యార్ధి సంఘాలు గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులని సవాలు చేస్తూ వేసిన ప్రజాహిత పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు, ఈరోజు ఇచ్చిన తీర్పులో ఆ విధంగా రిజర్వేషన్లు మంజూరు చేయడం రాజ్యంగా విరుద్ధమని ప్రకటించింది. ఇది గుజరాత్ ప్రభుత్వానికి ఊహించని పెద్ద ఎదురుదెబ్బగానే భావించవచ్చు.

గుజరాత్ లో పటేల్ కులస్తులు మిగిలిన సామాజిక వర్గాల ప్రజల కంటే అన్నివిధాల చాలా మెరుగైన స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు, వ్యాపార రంగాలలో వారిదే పైచెయ్యి. అయినప్పటికీ, హార్దిక్ పటేల్ నేతృత్వంలో పటేల్ కులస్తులకి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మహోదృతంగా ఉద్యమాలు చేశారు. వచ్చే ఏడాదిలో గుజరాత్ శాసనసభకి ఎన్నికలు జరుగుతాయి. కనుక పటేళ్ళ ఉద్యమాలు ఇంకా కొనసాగినట్లయితే, తమ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగి ఎన్నికలలో నష్టపోతామనే భయంతో, పటేల్ కులస్తులలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ ఏడాది మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానితో వారి ఉద్యమం చల్లారింది. కానీ అన్ని విధాలా ఉన్నత స్థాయిలో ఉన్న పటేళ్ళకి రిజర్వేషన్లు కల్పించడంపై రాష్ట్రంలో బీసిలు భగ్గుమన్నారు. వారు కోర్టుని ఆశ్రయించడంతో నేడు ఈ తీర్పు వెలువడింది. కనుక మళ్ళీ ఇప్పుడు పటేల్ కులస్తులు రోడ్లెక్కడం తధ్యం.

ఈ ఉద్యమాలని సమర్ధంగా ఎదుర్కోలేకపోయినందుకే, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ చేత భాజపా అధిష్టానం రాజీనామా చేయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈరోజు భాజపా అధిష్టానం గుజరాత్ ముఖ్యమంత్రి పేరుని ఖరారు చేసే అవకాశం ఉంది. ఆనందీబెన్ స్థానంలో కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోయే ముఖ్యమంత్రికి హైకోర్టు తాజా తీర్పుతో మళ్ళీ అవే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.