ఎన్నికలొస్తే కాంగ్రెస్ పార్టీకి జ్వరం వస్తోందేమిటో?

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం మొన్న వారణాసి వెళ్ళిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి వైరల్ ఫీవర్ రావడంతో, ఆమెని మోడీ పంపిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువచ్చి సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెపుతున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో యూపి ఎన్నికలు జరుగుతాయి. గత రెండేళ్లుగా వరుస ఓటములతో కృంగిపోతున్న కాంగ్రెస్ పార్టీ, సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం చేజార్చుకొన్న తన పుట్టిల్లు-ఉత్తరప్రదేశ్ ని ఈ ఎన్నికలలో ఎలాగయినా మళ్ళీ స్వాధీనం చేసుకోవాలని తహతహలాడుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత రాహుల్ గాంధీకి అప్పగించకుండా ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ కి అప్పగించింది.

ఆయన కూడా రాహుల్ గాంధీని పక్కనబెట్టి రాజకీయాలకి దూరంగా ఉంటున్న ప్రియాంక వాద్రాకి ప్రచార బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని చెప్పడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్! ప్రధానమంత్రి కుర్చీలో ఠీవిగా కాలుమీద కాలేసుకొని దేశాన్ని, అదే చేత్తో కాంగ్రెస్ పార్టీని ఏలుకోవలసిన తన ముద్దుల కొడుకు కనీసం యూపి ఎన్నికల ప్రచారానికి కూడా పనికిరాడని చెపితే, ఆ తల్లి హృదయం ఎంతగా తల్లడిల్లి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

ఎన్నికలలో ఓడిపోయే అవకాశం ఉందని గ్రహించినపుడల్లా ఆ అప్రదిష్ట తమ యువరాజా వారికి అంటకూడదని ఆయనని ఈ విధంగా పక్కన పెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. 2014 ఎన్నికలలో, ఆ తరువాత జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికలలో, ఇటీవల జరిగిన కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికలప్పుడు, మళ్ళీ ఇప్పుడు యూపి ఎన్నికలలోనూ అదే జరుగుతోంది. కానీ ఈ విషయం బయటకి చెప్పుకొంటే సిగ్గు చేటు కనుక చెప్పుకోలేక, ఓపిక లేకపోయినా సోనియా గాంధీ వారణాసిలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరివెళ్ళక తప్పలేదు. ఇప్పుడు ఆమెకి జ్వరం రావడం, కేరళ,తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీకి జ్వరం రావడం కాకతాళీయమే కావచ్చు కానీ ఎన్నికలొస్తే కాంగ్రెస్ పార్టీకి జ్వరం పట్టుకొంటుందని ప్రతిపక్షాలు అనకుండా ఊరుకోవడం లేదు.   

కొసమెరుపు ఏమిటంటే, యుపికి కొత్త పిసిసి అధ్యక్షుడుగా నియమితులైన రాజ్ బబ్బర్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూసి, “ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం అసాధ్యం” అని ప్రకటించేశారు. మళ్ళీ అంతలోనే “వారణాసిలో సోనియా గాంధీ ప్రచారంతో ఆ అద్భుతం జరుగుతుందని” జోస్యం చెప్పారు. కానీ ఆమె ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పుడైనా యువరాజా వారు ధైర్యం చేసి ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత స్వీకరిస్తారో లేక అక్కయ్యకి అప్పగించేసి, లోక్ సభలో కునుకు తీస్తూ, మెలకువ వచ్చినప్పుడు మోడీని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తారో చూడాలి.