భాజపాకి అగ్నిపరీక్షలు: గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో పంజాబ్ పై బిజెపి పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఎందుకంటే అక్కడ దానికి పెద్దగా పట్టు లేదు. పైగా ఆమాద్మీ పార్టీ అక్కడ దూసుకుపోతోంది. కానీ మిగిలిన రెండు రాష్ట్రాలు కూడా బిజెపికి చాలా ముఖ్యమైనవే.  

సుమారు రెండు దశాబ్దాలుగా గుజరాత్ బిజెపి పాలిస్తోంది. కానీ పటేళ్ళ రిజర్వేషన్ల ఉద్యమాలు, ఇటీవల దళితులపై జరిగిన దాడులకి నిరసనగా చిన్నగా మొదలైన ఉద్యమాలతో బిజెపి అప్రమత్తం అయ్యింది. వాటిని ధీటుగా ఎదుర్కోవడంలో విఫలం అయిన గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ ని కుంటి సాకులు చూపించి రాజీనామా చేయించింది. ఆమె స్థానంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్యమంత్రిని చేద్దామని బిజెపి మొదట అనుకొంది. కానీ యూపి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయనని గుజరాత్ కి పంపించడం మంచిది కాదని ఆ ఆలోచన విరమించుకొన్నట్లు తెలుస్తోంది.

గుజరాత్ లో దాడులకి గురైన దళితులకి సంఘీభావం ప్రకటించేందుకు యూపిలో ప్రతిపక్షపార్టీ-బి.ఎస్.పి. అధినేత్రి మాయావతి ప్రస్తుతం గుజరాత్ లోని ‘ఉనా’లో పర్యటిస్తున్నారు. భాజపా దళితులని చాలా చులకనగా చూస్తుందని, అందుకు గుజరాత్ లో దళితులపై జరిగిన దాడులు, అందుకు నిరసనగా మొదలవుతున్న ఉద్యమాలే నిదర్శనమని కాంగ్రెస్, బి.ఎస్.పి. సమాజ్ వాదీ పార్టీలు ప్రచారం చేయకుండా ఉండవు. ఒకవేళ ఈ కారణంగా అది యూపి, గుజరాత్ రాష్ట్రాలలో ఓడిపోతే భాజపాకి ఆ ఓటమి తీరని అప్రదిష్ట మిగులుస్తుంది. ఆ ప్రభావం తరువాత జరిగే ఎన్నికలపై ప్రసరిస్తుంది.

కనుక గుజరాత్ లో పరిస్థితులని మళ్ళీ చక్కదిద్ది వచ్చే ఎన్నికలలో గుజరాత్, యూపి రాష్ట్రాలలో బిజెపికి నష్టం కలుగకుండా చూడవలసిన బాధ్యత కొత్త ముఖ్యమంత్రిపైనే ఉంటుంది. ఈ రోజు జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి పేరుని బిజెపి ఖరారు చేస్తుంది. ఒకవేళ యూపిలో ఓడిపోయి గుజరాత్ లో మళ్ళీ అధికారం నిలబెట్టుకోగలిగితే కొంత నయం. లేకుంటే కష్టమే!  కనుక గుజరాత్, ఉత్తరప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా బిజెపికి పెద్ద అగ్ని పరీక్షనే పెట్టబోతున్నాయి.