కలాం వద్దు.. గాంధీ ముద్దు

మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుతెచ్చుకున్న ఏపిజె అబ్దుల్ కలాం మరణించినప్పుడు సోషల్ మీడియా వేదికగా ఓ ఉద్యమం నడిచింది. అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం దక్కాలని.. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ ప్లేస్ లో అబ్దుల్ కలాం బొమ్మను ముద్రించాలని డిమాండ్ వినిపించింది. కలాంతో పాటుగా నేతాజీ, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వాళ్ల బొమ్మలను ముద్రించాలని డిమాండ్లు బలంగా వినిపించాయి. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. 

కేంద్ర ప్రభుత్వానికి కరెన్సీ నోటుపై గాంధీ బొమ్మను మార్చాల్సిన అవసరం లేదని.. అలాంటి ప్రతిపాదన కూడా తమ వద్ద లేదని, ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాలా తెలిపారు. కరెన్సీ నోట్లపై బొమ్మల అంశాన్ని యుపిఎ హయంలో అత్యున్నత కమిటి నిర్ణయించిందని.. గాంధీ బొమ్మను తొలగించేది లేదని అన్నారు. భద్రతా ప్రమాణాలు, నోట్ల డిజైన్లు టైంను బట్టి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మొత్తంగా గాంధీ బొమ్మ స్థానంలో కలాం బొమ్మ కేవలం కల మాత్రమే.