
ఏపిలో ప్రత్యేక హోదా కోసం జరగుతున్న ఆందోళనలు సిఎం చంద్రబాబు నాయుడును డైలమాలో పడేశాయి. ముందు నుండి కూడా ప్రత్యేక హోదాపై పెద్దగా స్పందించని చంద్రబాబు, ఇప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదాపై ఏదో ఒకటి చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో ఉన్నది మిత్రపక్షమే అయినా కూడా ఇప్పటి దాకా రాష్ట్రానికి కొత్తగా వచ్చిన లాభం అయితే ఏమీ లేదు. కేంద్రం నుండి నిధులను తీసుకురావడంలో ముందు నుండి విఫలమైన చంద్రబాబు, ప్రత్యేక హోదా కోసం నడుం బిగించాల్సిన అవసరం ఏర్పడింది.
ఏపిలో బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీ వేస్తున్న ఎత్తులకు చంద్రబాబు చిత్తవుతున్నాడు, పార్లమెంట్ లో కేవీపీ చేత ప్రైవేట్ బిల్ పెట్టించి... దానిపై విజయసాయి రెడ్డి ద్వారా అందరి దృష్టికి తీసుకురాగలిగారు వైయస్ జగన్. దాంతో కేంద్రం కూడా దీనిపై స్పందించాల్సి వచ్చింది. చివరకు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు కేవలం ప్యాకేజీని కేంద్రం ఓకే చేసింది. విభజన హామీల్లో ఉన్న ప్రత్యేక హోదా ఖచ్చితంగా కావాల్సిందే అంటూ ఆందోళనలకు సిద్ధమయ్యాయి ప్రతిపక్షాలు.
మోదీ దగ్గర ముందు నుండి మెతక వైఖరిని అవలంబిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం గట్టిగా ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితి. ఇక ఏపిలో ప్రతిపక్ష నేత జగన్ మాత్రం కొరకరాని కొయ్యగా మారాడు. దాంతో చంద్రబాబు సారు పరిస్థితి ముందు చూస్తే నుయ్యి,.. వెనక చూస్తే గొయ్యిలా మారింది. ప్రత్యేక హోదా కోరుతూ ఏపిలో జరిగిన బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. ప్రభుత్వ వర్గాలు మాత్రం బంద్ పాక్షికం అని ప్రచారం చేసినా కానీ బంద్ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది.