గ్యాంగ్ రేప్ కూడా రాజకీయ కుట్రేనట!

మన రాజకీయ నేతలకి మహిళల పట్ల ఎంత చులకనభావం ఉందో తెలుసుకోవాలంటే, ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ లో జరిగిన తల్లీ కూతుళ్ళపై అత్యాచారం గురించి ఆ రాష్ట్ర మంత్రి అజాం ఖాన్ చెప్పిన  మాటలు వింటే అర్ధం అవుతుంది.

మొన్న శుక్రవారం రాత్రి నోయిడా నుంచి షహజాన్పూర్ కి కారులో వెళుతున్న ఒక కుటుంబాన్ని జాతీయ రహదారిపై కొందరు దొంగలు అడ్డుకొని ఆ కారులో ఉన్న 34ఏళ్ల మహిళని, ఆమె 13 ఏళ్ల కుమార్తెని తుపాకీ చూపి వారి ఒంటిపై ఉన్నబంగారాన్ని దోచుకోవడమే కాకుండా వారిపై అత్యాచారం కూడా చేశారు. ఆ సంఘటనపై దేశంలో అన్ని పార్టీలు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ హక్కుల సంఘం ఆ కేసుని సుమోటుగా స్వీకరించి, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి, పోలీసులకి నోటీసులు జారీ చేసింది. ప్రజలు, ప్రతిపక్షాలు అందరూ దోషులని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

ఇటువంటి దారుణమైన సంఘటనల పట్ల ఎంతో బాధ్యతాయుతంగా స్పందించవలసిన మంత్రి అజాం ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఏడాది రాష్ట్ర శాసన సభకి ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఎన్నికల ముందు మా ప్రభుత్వం పరువు తీసేందుకు ఎవరో ఈ కుట్రపన్నారని అనుమానం కలుగుతోంది. పోలీసుల దర్యాప్తులో అన్నీ బయటపడతాయి,” అని అన్నారు.

తమ పాలనలో మహిళలపై ఈ విధంగా అత్యాచారాలు జరుగుతుంటే అందుకు సిగ్గుతో తలదించుకోకుండా, నిసిగ్గుగా ఎన్నికలకి ముందు తమ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుజేసేందుకే జరిగిన కుట్ర అని మంత్రి చెప్పడం చాలా విస్మయం కలిగిస్తుంది. అక్కడ అధికారంలో ఉన్న సమాజ్ వాదీ ప్రభుత్వ పాలనలో గత రెండేళ్లలో అనేక సార్లు మత ఘర్షణలు జరిగాయి. మహిళలు, బాలికలపై సామూహిక అత్యాచారాలు చేసి, ఆ తరువాత వారిని హత్య చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించడం వంటి సంఘటనలు చాలా సార్లు జరిగాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్టుంది. ఈసారి ఇంకా దారుణంగా స్పందించింది.

“అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ 1,000 సార్లు మత ఘర్షణలు సృష్టించగలిగితే, అధికారం కోసం గుజరాత్ లో మారణహోమం జరిగితే, మహిళలపై అత్యాచారాలు కూడా జరిపించినా ఆశ్చర్యమేమీ లేదు. ఒకవేళ మహాత్మాగాంధీ బ్రతికుంటే ఇటువంటి సంఘటనలు జరిగేవి కావు. అడ్డొస్తే ఆయనని కూడా హత్య చేయడానికి వెనుకాడరు,” అని అజాం ఖాన్ అన్నారు. బులంద్ షహర్ లో తల్లీ కూతుళ్ళపై జరిగిన అత్యాచారమే చాలా దారుణం అనుకొంటే, మంత్రి అజాం ఖాన్ మాటలు అంతకంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఇటువంటి నేతల చేతిలో రాజ్యం నడుస్తుంటే ఇక మహిళలకి రక్షణ ఎక్కడ ఉంటుంది?