
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా వైసిపి నేడు రాష్ట్ర బంద్ కి పిలుపునిస్తే, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ దానికి మద్దతునిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం బిజెపికి మిత్రపక్షంగా ఉన్న టిడిపి ఎంపిలు, వారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అందరూ కూడా కేంద్రంపై ఈ సారి చాలా గట్టిగానే ఒత్తిడి తెస్తున్నా కూడా ఏపికి హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. దానికి బదులుగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇస్తానని చెపుతోంది. చంద్రబాబు కూడా అదే కోరుకొంటున్నారు కనుక బహుశః ఆయన అందుకు సంతోషంగా అంగీకరించవచ్చు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రత్యేక హోదాని పక్కనపెట్టి ఈ విధంగా ‘ఆర్ధిక డీల్’ కుదుర్చుకొంటునప్పుడు, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా కోసం ధర్నాలు, బంద్ లు నిర్వహించడం వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అని ఆలోచిస్తే ఉండదనే అర్ధం అవుతుంది.
ఏపిలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసమే ఈ అంశాన్ని వాడుకొని పోరాడుతుంటే, దీనితో తన ‘ప్రియ శత్రువు’ చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వామపక్షాలు ఎన్నటికీ అధికారంలోకి రాలేకపోయినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఏ కార్యక్రమానికైనా మద్దతు ఇస్తాయి కనుక అవీ ఏపి బంద్ లో ఓ చెయ్యి వేసి తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే, టిడిపి చేతులు ముడుచుకొని కూర్చుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇంకా అలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి ఎగరేసుకు వెళ్లిపోతాడనే వివేకం, భయం రెండూ ఉండడం వల్లే కాబోలు, టిడిపి ఎంపిలు ఢిల్లీ లో హడావుడి చేస్తున్నారు.
ఈ విధంగా ఏపిలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నిటికీ ఎవరి లెక్కలు వారికున్నాయి. ఆ లెక్కలలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయనే విషయం వచ్చే ఎన్నికలలో ప్రజలే నిర్ణయిస్తారు. వారి చేత ఎక్కువ మార్కులు వేయించుకోవాలంటే ఇటువంటి హడావుడి చేయక తప్పదు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, బంద్ లు, ర్యాలీలు, బహిరంగ సభల ద్వారానే తమ అసమ్మతి తెలియజేయవచ్చనే అప్రకటిత సిద్ధాంతం ఒకటుంది కనుక దానిని ఫాలో అవుతున్న ప్రతిపక్ష పార్టీలని ఎవరూ తప్పుపట్టలేరు. వాటి స్వార్ధ రాజకీయ పోరాటాలకి ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ అనే అందరికీ ఆమోదయోగ్యమైన ముసుగులు వేసినా ఎవరూ కాదనలేము. ప్రత్యేక హోదా రాదని రెండేళ్ళ క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిసి ఉన్నప్పటికీ మొన్న రాజ్యసభలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినప్పుడే ఆ సంగతి తెలిసినట్లుగా నటిస్తూ తెదేపా ఎంపిల చేత కేంద్రాన్ని తిట్టిపోయించి, ఢిల్లీలో హడావుడి చేయడం కూడా ఆ మార్కుల కోసమే అని భావించవచ్చు.