గుజరాత్ సిఎం రాజీనామా

గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ రాజీనామా ప్రకటించారు. 2014 నుంచి ముఖ్య మంత్రిగా ఉన్న పటేల్ సారధ్యంలో నరేంద్ర మోడీ తర్వాత గుజరాత్ ప్రత్యర్థుల నుంచి గట్టి సవాళ్లను ఎదుర్కొంటోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రం లో బిజెపికి తాజా సారథి అవసరం ఉందని ఆమె చెప్పారు. 2014 మే 22న గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ స్థానంలో ఆమె పదవిని చేపట్టారు. ఆ మేరకు పార్టీకి ఆమె లేఖ రాశారు. రెండు నెలల క్రితం కూడా పార్టీని ఇదే కోరిక కోరారని చెప్పారు. 

2017లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చే జనవరిలో జరగనున్న ‘వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్’ విజయవంతం చేయడానికి కొత్త ముఖ్యమంత్రి పనిచేయవలసి ఉందని గుర్తు చేశారు. 75 ఏళ్ల వయసుకు వైదొలగాలన్న నిబంధన మంచిదని పేర్కొంటూ దానివల్ల యువతకు అవకాశం లభిస్తుందని చెప్పారు. 75ఏళ్ల వయసు వచ్చిన కేంద్రమంత్రులు నజ్మాహెప్తుల్లాను రాజీనామా చేయాల్సిందిగా కోరిన మీదటే ఆమె వైదొలగారని వినపడింది. అంతకు ముందు మధ్యప్రదేశ్‌లో ఇద్దరు బిజెపి మంత్రులు కూడా అదే కారణంపై వైదొలగారు. 2014 నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడినప్పుడు ఇదే నిబంధనపై అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంత కుమార్, యశ్వంత్ సిన్హాలను కేబినెట్‌లో చేర్చుకోలేదు. పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించడం, దళితుల ఆందోలనల నేపథ్యంలో ఆనంది బెన్ చాలా ఒత్తిడికి గురయ్యారని, అందుకే ఆమె తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.