
గ్రేటర్ ఎన్నికల తరువాత దూరం అయిన టిడిపి, బిజెపిలు మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు ఏపిలో కూడా ఆ రెండు పార్టీలు కటీఫ్ చెప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్లున్నాయి. ఒకవేళ కటీఫ్ చెప్పుకొన్నట్లయితే, తెలంగాణ లో టిడిపి, ఏపిలో బిజెపి ఒంటరి పోరాటాలు చేయవలసి ఉంటుంది. బహుశః అందుకే బిజెపి అధ్యక్షుడు అమిత్ షా టిఆర్ఎస్ కి కేంద్రమంత్రి పదవి ఆఫర్ చేసి దానితో జత కట్టాలని ప్రయత్నించారేమో కానీ చంద్రబాబు కంటే కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీ వైఖరిని, బిజెపి అవసరాన్ని బాగా అర్ధం చేసుకొన్నందున, అమిత్ షా ఆఫర్ ని నిర్ద్వందంగా నిర్మొహమాటంగా తిరస్కరించారు.
కారణాలు ఏవైతేనేమి చంద్రబాబు మాత్రం మోడీనే నమ్ముకొని రెండేళ్ళు వృధా చేసుకొన్నారు. అయితే బిజెపితో స్నేహం వలన ఏపి పూర్తిగా నష్టపోయిందనే వైసిపి వాదన, విమర్శలు సరికాదు. వాటి స్నేహం వలన ఆంధ్రప్రదేశ్ కు ఎంతో కొంత మేలే జరిగింది తప్ప నష్టం జరుగలేదని అందరికీ తెలుసు. కానీ ఒకవేళ ఇప్పుడు బిజెపితో టిడిపి కటీఫ్ చెప్పేస్తే ఆ రెండు పార్టీలకి, ముఖ్యంగా బిజెపికి, ఏపి రాష్ట్రానికి ఎంతో కొంత నష్టం జరుగవచ్చు. అంతేకాదు.. మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమికి ప్రత్యామ్న్యాయంగా జాతీయ స్థాయిలో మూడవ కూటమి ఏర్పాటుకి ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు.
దేశంలో చంద్రబాబు, నితీష్ కుమార్ మాత్రమే సమర్ధులైన ముఖ్యమంత్రులని తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డి ఇటీవలే ఒక సర్టిఫికేట్ జారీచేసేశారు. నితీష్ కుమార్ కూడా చాలా కాలంగా ప్రధాని పదవిపై కన్నేసి ఉన్నారు కనుక ఒకవేళ టిడిపి, బిజెపిలు విడిపోతే, చంద్రబాబు నితీష్ కుమార్ కి మద్దతు ప్రకటించవచ్చు.
తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగాలని కెసిఆర్ కోరుకొంటున్నారు కనుక ఒకవేళ ఆయన కూడా నితీష్ కుమార్ కి అండగా నిలబడినా ఆశ్చర్యం లేదు. కనుక టిడిపి, బిజెపిల మధ్య బంధంలో మార్పులు ఏర్పడితే అది ఒక్క ఏపికే పరిమితం కాకపోవచ్చు. కానీ అవి కటీఫ్ చెప్పుకొంటాయో లేకపోతే యధా ప్రకారం రెండూ కలిసి ఇదే విధంగా ఏపి ప్రజలని మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తాయో త్వరలోనే తేలిపోవచ్చు.