ఏపికి హోదా! సారీ...ఆ ఒక్కటీ అడగొద్దు!

ఆనాడు రాష్ట్ర విభజన జరుగబోతోందని అందరికీ చాలా ఖచ్చితంగా తెలుసు కానీ చివరి నిమిషం వరకు కూడా ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో అందరూ ఎదురు చూశారు. ఊహించినట్లుగానే చివరికి రాష్ట్ర విభజన జరిగింది. కేంద్రప్రభుత్వం ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వబోదని అందరికీ చాలా ఖచ్చితంగా తెలుసు..అయినా మళ్ళీ ఇప్పుడు అదే ఉత్కంఠ..చివరికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పేసి రాజ్యసభ రెండు రోజులుగా సాగుతున్న సస్పెన్స్ డ్రామాకి తెర దించేశారు. రాష్ట్ర విభజన తరువాత ఏపి లేదా తెలంగాణ రాష్ట్రాల సమస్యలని చర్చించడం కోసం ఏనాడూ పార్లమెంటులో రెండు రోజులు కేటాయించలేదు. కనుక ప్రత్యేక హోదా, ఇతర హామీల అమలు గురించి రాజ్యసభలో రెండు రోజులు చర్చించడమే చాలా గొప్ప విషయమని తృప్తి పడాలేమో!

రాజ్యసభలో దీనిపై నిన్నటి నుంచి జరుగుతున్న చర్చకి అరుణ్ జైట్లీ అందరూ ఊహించినట్లు గానే స్పందించారు. గణాంకాలు, కారణాలు, సమస్యలు ఏకరువు పెట్టి ఏపికి ప్రత్యేకహోదా కంటే చాలా ఎక్కువే ఇస్తున్నాం గనక, హోదా కోసం, ఇంకా పట్టుబట్టడం సబబు కాదు అని చెప్పారు. నీళ్ళు, భాషలు, ప్రాంతాలు, లాంటి అనేక అంశాలు సెంటిమెంట్ గా మారుతుంటాయని, కనుక రాష్ట్రాభివ్రుద్ధికి  కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా? అని చూసుకోవాలే తప్ప ప్రత్యేక హోదా వచ్చిందా లేదా? అని కాదని జైట్లీ సూచించారు.

రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కూడా జైట్లీ ఇలాగే డొంక తిరుగుడు సమాధానం చెప్పారు. కేంద్రానికి వచ్చే ఆదాయం, దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి వెళ్ళే వాటా, రక్షణ రంగానికి కేటాయింపులు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులు వగైరా గణాంకాలు వివరించి, ఏపికి చెల్లించవలసిన రెవెన్యూ లోటుని ప్రతీ ఏటా దశల వారిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్లుగా ఒకేసారి రూ.16,000 కోట్లు ఇవ్వలేమని జైట్లీ తేల్చిచెప్పారు.

గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటి కోసం ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా, ఇవ్వలేదు. మరి అటువంటప్పుడు రాజ్యసభలో ఓ రెండు రోజులు చర్చించినంత మాత్రాన కేంద్రప్రభుత్వం మనసు మార్చుకొని అన్ని హామీలని అమలు చేస్తుందని ఆశించడం అవివేకమే. ఆ సంగతి అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు. కానీ ఏపి కోసం తామే పోరాడుతున్నాము..తమకే రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమ కారిపోతోందని నిరూపించుకోవడానికే ఈ కార్యక్రమం పెట్టుకొని పోటాపోటీలుగా వాదించుకొన్నారు. చివరికి ఊహించినట్లే ఏపికి ఒరిగిందేమీ లేదు.