ఈసారైనా జి.ఎస్.టి.బిల్లుకి మోక్షం లభిస్తుందా?

మోడీ ప్రభుత్వం జి.ఎస్.టి.బిల్లుని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కానీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దానిలో లోపాలు ఎత్తిచూపి వాటిని సవరిస్తేగానీ మోక్షం కల్పించమని తెగేసి చెప్పాయి. ఇక చేసేదేమీలేక మోడీ ప్రభుత్వం బిల్లులో అవి సూచిస్తున్న మూడు సవరణలు చేసింది. కానీ రెండింటిని తనకు నచ్చిన పద్ధతి లోనే చేసింది.

జి.ఎస్.టి.బిల్లులో ఉత్పాదక సంస్థలపై విధించిన అదనపు 1శాతం పన్నుని రద్దు చేసింది. ఈ జి.ఎస్.టి. విధానం కారణంగా రాష్ట్రాలు నష్టబోయే ఆదాయాన్ని ఐదేళ్ళ వరకు కేంద్రమే 100 శాతం భర్తీ చేయాలని కాంగ్రెస్ డిమాండ్. కానీ మొదటి 3సంలు 100 శాతం, ఆ తరువాత సం.లలో వరుసగా 75, 50 శాతం నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ కొత్త పన్నుల విధానం కారణంగా అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తితే వాటి పరిష్కారం కోసం సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక సాధికార వ్యవస్థని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్. కానీ దానికి బదులుగా జి.ఎస్.టి.కౌన్సిల్ ని ఏర్పాటు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించుకొంది. నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకొన్నారు.

కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేస్తున్న డిమాండ్లకి కేంద్రప్రభుత్వం తలొగ్గి కొన్ని సవరణలు చేసింది కనుక ఇప్పుడు అవి కూడా ఆ బిల్లు ఆమోదానికి సహకరించినట్లయితే, వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అమలులోకి వస్తుంది. దాని వలన భారత్ లో వృద్ధి రేటు కనీసం రెండు శాతం పెరుగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ బిల్లుకి ప్రత్యేక హోదా అంశానికి ముడిపెట్టాలనే వాదన వినపడటంతో అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం ఈరోజు రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చర్చకి అంగీకరించింది. ప్రతిపక్ష పార్టీలకి తామే గెలిచామనే భావన కల్పించి వారి అహం చలార్చి, వారిచేత ఈ జి.ఎస్.టి.బిల్లుపై ఆమోదముద్ర వేయించుకోవాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తునట్లుంది. కనుక ఈ సారైనా జి.ఎస్.టి.బిల్లుకి మోక్షం లభిస్తుందో లేదో చూడాలి.