
ఇదేదో సినిమా టైటిలో.. లేదంటే సినిమా స్టోరీయో అనుకుంటే పొరపాటే. కేరళలో జరిగిన ఘటన. ఇద్దరు కుమార్తెలు తమ తల్లికి అరుదైన బహుమతినిచ్చి...ఆమె పట్ల తమ ప్రేమను ప్రదర్శించారు. తల్లి వయసులో ఉండగా ప్రేమించిన వ్యక్తితో కలిపి వివాహం చేయించారు. 1984లో ఒచిరా అనే గ్రామంలో అనిత అనే అమ్మాయి పదో తరగతి చదివేది. పదో తరగతి కాబట్టి ట్యూషన్లకు వెళ్లేది. అక్కడ విక్రమన్ అనే టీచర్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఈ ప్రేమకథకు అనిత తల్లిదండ్రులు అడ్డుతగిలారు.
అనిత, విక్రమన్ ల పెళ్లికి అనిత తండ్రి అభ్యంతరం చెప్పాడు. దీంతో పెద్దల మాటకు విలువ ఇచ్చిన అనిత, విక్రమన్ దూరమయ్యారు. ఈ క్రమంలో అనిత కంటే వయసులో బాగా పెద్ద వ్యక్తితో వివాహం జరిపించారు. దీంతో ఇక వారిద్దరూ కలిసే అవకాశం లేకుండా పోయింది. వారు కూడా కలుసుకునేందుకు ఏనాడూ ప్రయత్నించలేదు. దీంతో విక్రమన్ ఆమెకు దూరంగా చవర అనే ఒక గ్రామానికి వెళ్లిపోయి, అక్కడ ఓ రాజకీయ కార్యకర్తగా పేరు సంపాదించుకున్నాడు. వివాహం తరువాత అనిత జీవితం సాఫీగా సాగలేదు. అనిత పెద్ద కుమార్తె అతిరాకు ఎనిమిదేళ్ల వయసప్పుడు ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆమె జీవితం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.
ఇద్దరు కుమార్తెలను పెంచి పెద్ద చేసేందుకు ఆమె చాలా కష్టడింది. వారిద్దరూ పెరిగి పెద్దయ్యారు. తల్లి కష్టం తెలిసిన ఆ ఇద్దరు ఆడపిల్లలు...ఆమె ప్రేమకథ గురించి తెలుసుకున్నారు. తమ కోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లికి మళ్లీ కొత్త జీవితం ఇవ్వాలని భావించారు. దీంతో విక్రమన్ తో ఆమెను కలిపితే సంతోషంగా ఉండే అవకాశం ఉందని వారు భావించారు. దీంతో అతనిని వెతికి పట్టుకుని, తల్లితో వివాహానికి ఒప్పించారు. దీంతో కుమార్తెలిద్దరికీ వివాహం చేసిన తరువాత తన జీవితం గురించి ఆలోచిస్తానని చెప్పింది. ఇద్దరు కుమార్తెలు ఒత్తిడి చేయడంతో ఆతిరాకు వివాహమయ్యాక వివాహం చేసుకుంటానని అనిత మాట ఇచ్చింది. దీంతో తన వివాహ తంతు పూర్తికాగానే అతిరా... అనిత, విక్రమన్ ల వివాహం జరిపించారు. దీంతో 32 ఏళ్ల సుదీర్ఘ ప్రేమకు కుమార్తెలిద్దరూ ప్రాణం పోశారు.