అమెరికా ఎన్నికల్లో ‘తొలి మహిళ’గా హిల్లరీ

అమెరికా అధ్యక్ష ఎన్నికలు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పేరు ఖరారైంది. దాంతో  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో నిలిచిన తొలి మహిళగా హిల్లరీ రికార్డుకెక్కించింది. దాంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో డైరెక్ట్ గా తేల్చుకోనుంది. డెమోక్రాటిక్‌ పార్టీ నేషనల్‌ కన్వెన్షన్‌లో హిల్లరీ అభ్యర్థిత్వానికి 4,764 మంది పార్టీ ప్రతినిధులు మద్దతిచ్చారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఆమెతో పోటీపడిన వెర్మాంట్‌ సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌ స్వయంగా ఆమె పేరును ప్రతిపాదించారు. 

డెమొక్రటిక్ పార్టీకి ముందు నుండి కూడా ఎంతో విధేయురాలిగా ఉన్న హిల్లరీ, చాలా కాలంగా అమెరికా రాజకీయాల్లో తన మార్క్ వేసుకుంటూ వస్తున్నారు. గతంలో తన భర్త బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తొలి మహిళగా, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఆమె పని చేశారు. ఒబామా కేబినెట్ లో ఆమె ఎంతో కీలకం. ఓ రకంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా తర్వాత సమర్థ నాయకురాలిగా హిల్లరీకి గుర్తింపు ఉంది. నవంబర్ 8న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ డొనాల్డ్ ట్రంప్ పై గెలవాలి. అలా గెలిస్తే మాత్రం తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్రలో నిలిచిపోనున్నారు.