పాక్ మరీ ఇంతగా రెచ్చిపోతోందేమిటి?

“కాశ్మీర్ పాకిస్తాన్ లో విలీనం అయ్యే రోజుకోసం ఎదురు చూస్తున్నాను,” అని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ నుంచి వేలమందితో కాశ్మీర్ ని ముట్టడిస్తామని ఉగ్రవాది హఫీజ్ సయీద్ బెదిరిస్తున్నాడు. భారత భద్రతదళాల చేతిలో హతం అయిన హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ పాక్ ప్రభుత్వానికి కాశ్మీర్ స్వాతంత్ర సమరయోధుడిగా, అమరవీరుడిగా కనిపిస్తున్నాడు. కనిపించడమే కాదు.. అలా ప్రకటించి..అతని మృతికి సంతాపంగా బ్లాక్ డే కూడా పాటించింది. అతని హత్యపై విచారణ జరపాలని అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. కాశ్మీర్ ప్రజలు భారత్ తో కలిసి ఉండాలా వద్దా? అని తేల్చుకొనేందుకు ప్రజాభిప్రాయ సేకరణని చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. గత రెండు వారాల నుంచి పాకిస్తాన్ నుండి భారత్ లోకి నిత్యం ఉగ్రవాదులు చొరబడే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా కొందరు ప్రయత్నిస్తే వారిలో నలుగురిని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఒకడు సజీవంగా పట్టుబడ్డాడు.   

పాకిస్తాన్ తీరు చూస్తుంటే, ఈ వేడిని చల్లారనీయకుండా నిలిపి ఉంచుతూ భారత్ పై మరింత ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తునట్లుంది. దాని ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే ఉన్నాయి. ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఇస్లామాబాద్ లోని భారత్ ఎంబసిని చుట్టుముట్టబోతున్నట్లు ప్రకటించగానే, దౌత్యాధికారులు అందరూ తమ పిల్లలని ఇకపై పాక్ పాఠశాలలకి పంపవద్దని తక్షణమే వారినందరినీ భారత్ కి పంపించేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బహుశః అది పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు తెగతెంపులు చేసుకొనడానికి సిద్ధంగా ఉన్నట్లు చేసిన తొలి హెచ్చరికగా భావించవలసి ఉంటుందేమో? కానీ ఆ హెచ్చరికలని పాకిస్తాన్ ఖాతరు చేసే పరిస్థితిలో ఉన్నట్లు కనబడటం లేదు.

భారత్ తో ప్రత్యక్ష యుద్ధం కోసం పాక్ సైనికాధికారులు చాలా కాలంగా ఉబలాటపడుతున్నారు. ప్రస్తుతం పాక్ తీరు, భారత్-పాక్ సంబంధాలు, కాశ్మీర్ లో పరిస్థితులు అన్నీ కూడా అందుకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. హఫీజ్ సయీద్ తన నేతృత్వంలో వేలాదిమందితో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి తరలి రాబోతున్నట్లు ప్రకటించాడు. పాతబస్తీలో ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడటం, కాశ్మీర్ లో వేర్పాటువాదులు రెచ్చిపోవడం, ఆయుధాలు అపహరించుకుపోవడం,  బిహార్ లో పాక్ జెండా రెపరెపలు వంటివన్నీ ఇప్పుడు భారత్ కి బయటి నుంచే కాదు, లోపల నుంచి కూడా చాలా ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేస్తున్నాయి. కనుక భారత్ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.