
మాజీ క్రికెటర్ నవజ్యోత్ సిద్దూ భాజపాకి, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీపార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బంపర్ ఆఫర్ వచ్చినందునే ఆయన రాజీనామా చేశారని టాక్ వినిపించింది. కానీ తనని పంజాబ్ కి దూరంగా ఉండమని పార్టీ కోరినందునే రాజీనామా చేశానని ఇప్పుడు కొత్త కథ చెపుతున్నాడు. పక్షులు తమ గూటికి దూరంగా ఏవిధంగా బ్రతుకలేవో తను కూడా తన పంజాబ్ కి దూరంగా ఉండలేనని, తనకి పార్టీలకంటే తన రాష్ట్రం, ప్రజలు, వారి ప్రయోజనాలే ముఖ్యమని దేశముదురు రాజకీయ నేతలాగా డైలాగ్స్ చెపుతున్నారు. కానీ తనని పంజాబ్ కి దూరంగా ఉండమని భాజపా ఎందుకు కోరిందో..అసలు ఆ అవసరం ఏమిటో చెప్పలేదు. అలాగే ఆమ్ ఆద్మీ ఆఫర్ గురించి కూడా సూటిగా జవాబు చెప్పలేదు. పంజాబ్ ప్రయోజనాలని ఏ పార్టీ కాపాడితే దానితోనే ఉంటానని చెప్పారంటే, ఏ పార్టీ మారడానికే ఆయన రాజీనామా చేశారని అర్ధమవుతోంది.
మీడియాలో వచ్చిన వార్తలు నిజమనుకొంటే, ఆయన ముఖ్యమంత్రి పదవి పొందవచ్చనే ఆశతోనే భాజపాని, ఎంపి పదవిని వదులుకొన్నట్లు అర్ధమవుతోంది. ఆ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూస్తే చాలు. భాజపాకి రాజీనామా చేసి ఒకప్పుడు తను తిట్టి పోసిన అరవింద్ కేజ్రీవాల్ పంచనే చేరుతారని తెలిసినప్పుడు, భాజపాతో సహా చాలా మంది అదే విషయం గుర్తు చేసి మళ్ళీ ఏ మోహం పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలనుకొంటున్నారు అని ప్రశ్నించారు. వాటికి సిద్దూ వెంటనే జవాబు చెప్పలేదు కానీ ఇప్పుడు ఈ విధంగా స్టోరీ తయారుచేసుకొని వచ్చి చెపుతున్నారు. సిద్దూ మంచి మాటకారి అని అందరికీ తెలుసు కానీ మరీ ఇంత దేశముదురు రాజకీయ నాయకుడని ఎవరూ ఊహించలేకపోయారు.