పది రూపయాలతో పది లక్షల భీమా

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేలను సంస్కరిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే చాలా మార్పులు చేసిన రైల్వే శాఖ, తాజాగా అతి తక్కువ ఖర్చుతో ప్రయాణికులకు భారీ భీమా సౌకర్యం అందించేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు రూ.10 కన్నా తక్కువ ఖర్చు ప్రీమియంతో.. 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడానికి సిద్ధమవుతున్నారు. రానున్న రైల్వే బడ్డెట్ లో ఈ కొత్త ప్రతిపాదనను రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రతిపాదించనున్నారు. సెప్టెంబర్ నెల నుంచి ప్రయోగత్మకంగా దీన్ని పరిశీలించబోతున్న రైల్వే శాఖ, ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసే ప్రయాణికులకు తొలుత ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది. ఆ తర్వాత దేశంలోని అన్ని రిజర్వేషన్ కేంద్రాల్లో దీన్ని అమలు చేయాలనే యోచనలో ఉంది కేంద్ర రైల్వే. 

ఇప్పటికే 17 భీమా కంపెనీలతో ఈ కొత్త ప్రతిపాదనపై రైల్వే శాఖ చర్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్న మూడు కంపెనీలను ప్రభుత్వం ఖరారు చేయబోతున్నట్లుగా సమాచారం. దీని ప్రకారం రైల్వే ప్రయాణికులు ఎవరైనా ప్రమాదం బారినపడితే.. పది లక్షల భీమా సౌకర్యం అందుబాటులోకి రానుంది. వైకల్యం బారిన పడడం, తీవ్ర గాయాల పాలవడం జరిగితే రూ.7.5 లక్షలు అందించనుంది రైల్వే శాఖ. అలాగే మృతదేహం తరలించడానికి అయ్యే ఖర్చుల కింద మరో పది వేల రూపాయల వరకు అదనంగా చెల్లించనుంది. ప్రయాణికులకు మరో వెసులుబాటును కల్పించిన రైల్వే శాఖ.. ఒకవేళ భీమా మొత్తాన్ని పెంచుకోవాలని భావించే ప్రయాణికులెవరైనా కొంత మొత్తం అదనంగా చెల్లించి రూ.50 లక్షల వరకు భీమా సౌకర్యం పొందవచ్చు.