విశాఖను అమెరికాకు ఇచ్చేశారు..!

ఏ దేశమూ మరో దేశానికి ఊరికే సాయం చేయదు. ప్రతిఫలం ఆశించకుండా ఒక దేశం మరో దేశంలో డబ్బు ఖర్చు చేయదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, యుద్ధ సమయాల్లో, కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు విదేశాలు విరాళాలు అందిస్తాయి. ఉచతంగా సాయం చేస్తాయి. ప్రతిఫలం ఆశించకుండా వస్తుసామగ్రి అందిస్తాయి. కాని మన దేశంలో అభివృద్ధి పనులు చేయడానికి విదేశాలు స్వచ్ఛందంగా ముందుకు వస్తాయా? కాని కేంద్ర ప్రభుత్వం వస్తున్నాయని చెబుతోంది. స్వచ్ఛందంగా ముందుకు రావడమంటే ప్రతిఫలం ఆశించకుండా ఉండటమా? దేశంలోని కొన్ని నగరాలను, పట్టణాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేసే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. వంద స్మార్ట్‌ సిటీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద నగరాలు, పట్టణాలు బాగుపడితే మంచిదే. వంద నగరాల్లో 20 నగరాలను ఈ ఏడాది స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేయబోతున్నారు. ఆ జాబితాను విడుదల చేశారు. తెలంగాణలో ఏ ఒక్క నగరాన్నీ ఎంపిక చేయని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కాకినాడలను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన ఇరవై నగరాల్లో రెండు నగరాలకు మాత్రమే విదేశీ సాయం అందుతుంది. అవి మహారాష్ట్రలోని పుణే, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. పుణేను ప్రాన్స్‌, విశాఖను అమెరికా అభివృద్ధి చేస్తాయి. అంటే ఈ రెండు నగరాలను ఆ దేశాలు దత్తత తీసుకున్నాయన్న మాట. మిగతా నగరాలను మనోళ్లే అభివృద్ధి చేస్తారని అర్థం. చెత్తాచెదారం లేకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, రవాణా వ్యవస్థను చక్కగా నిర్వహించడం, మంచినీటి సరఫరాకు అంతరాయం కలడకుండా చూడటం, చూడచక్కనైన రహదారులు నిర్మించడం, ఉన్నవాటిని మంచిగా నిర్వహించడం, నిరంతర విద్యుత్‌ సరఫరా....ఇలా మొత్తం స్మార్ట్‌గా చేయాలి.