రేవంత్ రెడ్డి ని కాపాడండంటూ చంద్రబాబు లేఖ

తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షనేత అనుముల రేవంత్‌రెడ్డికి ప్రాణహాని ఉందని ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రేవంత్‌రెడ్డి పోరాడుతున్నారని, దీంతో ఆయనకు ప్రాణహాని ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆయనకు అదనపు భద్రత కల్పించాలని, అదనపు భద్రత కోసం హైకోర్టు సైతం ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. వెంటనే రేవంత్‌రెడ్డికి అదనపు భద్రత కల్పించేలా తెలంగాణ రాష్ట్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసేలా కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా తెలంగాణ తెలుగుదేశం నాయకుల్లో మిగిలిన నాయకుల్లో కాస్తో కూస్తో మాట్లాడే నాయకుడు అంటే కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే. ఆయన కూడా పార్టీ మారితే టిటిడిపి తెలంగాణ శాఖను మూసివెయ్యాల్సిన పరిస్థితి వస్తుందనే చంద్రబాబు రేవంత్ కు బాగా సపోర్ట్ చేస్తున్నారని వార్త వినిపిస్తోంది.